Let's talk: editor@tmv.in
ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న పాకిస్తాన్‌

ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న పాకిస్తాన్‌

Venkatesh Balusula
25 సెప్టెంబర్, 2025

ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు మ‌రోసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై తీవ్ర అవ‌మానం జ‌రిగింది. పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిస్తోంద‌ని, ఆ దేశంలోనే భార‌త్‌పై దాడుల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని ఐక్య రాజ్య స‌మితి మాన‌వ హ‌క్కుల కౌన్సిల్ 60వ స‌మావేశంలో భార‌త ప్ర‌తినిధి షా ఫైస‌ల్ మ‌హ‌మ్మ‌ద్ ధ్వ‌జ‌మెత్తారు. పాకిస్తాన్ అంత‌ర్జాతీయ మానవ హ‌క్కులు, మాన‌వ‌తా చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తోంద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా షా ఫైసల్ ఏప్రిల్ 22న భార‌త్‌లో జ‌రిగిన‌ పహల్గామ్ ఉగ్ర‌దాడి గురించి ప్ర‌స్తావించారు. ఈ దాడి అత్యంత‌ భయంకరమైనద‌ని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్ర‌వాద సంస్థ‌లే ఈ దాడికి పాల్ప‌డ్డాయ‌న్నారు. ప‌హ‌ల్గామ్‌లో సాధారణ ప్రజలపై దాడి చేసి చంపేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందులో ఇత‌ర దేశాల పౌరులు కూడా ఉన్నార‌ని, వ్య‌క్తిగ‌త‌, మ‌త‌ స్వేచ్ఛను అణ‌చివేస్తూ కిరాత‌కంగా దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదంలో మాన‌వ హ‌క్కుల‌కు చోటు ఉండ‌ద‌ని, పాకిస్తాన్ అదే రుజువు చేస్తోంద‌ని షా విమ‌ర్శించారు. ఈ దాడులు శాంతిని భంగం చేయడ‌మే కాకుండా, సమాజాన్ని విభజించి, స్వేచ్ఛను క‌నుమ‌రుగు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌రుగుతున్నాయ‌న్నారు.

క‌శ్మీర్ ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న‌

ఈ సంద‌ర్భంగా భార‌త్ మానవ హక్కుల కౌన్సిల్‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఉగ్ర‌వాదానికి మద్దతిచ్చే వ్యవస్థను ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ఉగ్ర‌వాదుల‌కు ఎక్క‌డి నుంచి ఆర్థిక స‌హ‌కారం అందుతోంది, వారికి శిక్షణ ఇచ్చే శిబిరాలు ఎక్క‌డ ఉన్నాయి, ఉగ్ర‌వాద‌ భావజాలాన్ని వ్యాప్తి చేసే బృందాలు, ఉగ్ర‌వాదుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న వారిని గుర్తించి నాశ‌నం చేశాయ‌ని కోరింది. ప్ర‌పంచంలో ఏ ఒక్క ఉగ్ర‌వాద బృందానికి సురక్షిత స్థానం ఉండ‌కూడ‌ద‌ని, మీడియా వేదిక‌ల స‌హ‌కారం, రాజకీయ మద్దతు ల‌భించ‌కూడ‌ద‌ని చెప్పారు. ఇలా చేస్తే ఉగ్ర‌వాదాన్ని క్షేత్ర‌స్థాయి నుంచి తొల‌గించేందుకు ఆస్కారం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఉగ్ర‌దాడికి పాల్ప‌డ్డ వారిని, వారి మద్దతుదారులను విచార‌ణ చేసి, బ‌హిర్గ‌తం చేయాల‌ని, నిందితుల‌కు క‌ఠిన‌ శిక్షలు విధించాలని స‌భ్య దేశాల‌ను కోరారు. ఇలాంటి స‌మ‌యంలో మౌనం, ఉదాసీనత వల్ల హింసాత్మక శక్తులు ధైర్యం పుంజుకుంటాయని హెచ్చరించారు. షా ఫైసల్ మహమ్మద్ త‌న ప్ర‌సంగంలో క‌శ్మీర్‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్థానికంగా జ‌రిగిన హింస ప్ర‌ధానంగా ఈ ప్రాంతంలోని అన్ని మతాలను సమానంగా చూసే వారిని, అందరినీ కలుపుకొనిపోయే వ్య‌క్తుల‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా జ‌రిగింద‌ని చెప్పారు. ఇలాంటి దాడుల‌తో జమ్మూ క‌శ్మీర్ ప్రజలను విడగొట్టి, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను చెడ‌గొట్టేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌ ప్రాంతం అభివృద్ధి ప‌థంలో ముందుకెళ్తూ, శాంతియుతంగా ఉంద‌ని, ఇలాంటి దాడులు స్థానికంగా ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చివేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. భారత ప్రజలు శాంతితో, గౌరవంతో, భద్రతతో జీవించాలని షా కోరారు. తీవ్రవాద హింసతో ఎవరూ భయాందోళ‌న‌కు గురికావొద్ద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఐరాస మాన‌వ హ‌క్కుల కౌన్సిల్‌ శాంతి కోసం, మానవ హక్కులను దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలని కోరారు.

ఐరాస స‌మావేశంలో భారత ప్ర‌తినిధి వ్యాఖ్య‌లు మ‌రోసారి క‌శ్మీర్ స‌మ‌స్య‌పై అంతర్జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం, ప‌హ‌ల్గామ్ దాడి గురించి ప్ర‌స్తావిస్తూ పాక్ పై చేసిన విమ‌ర్శ‌లు ప్ర‌పంచ దేశాల నుంచి పాక్‌పై ఒత్తిడి పెంచే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌ల ఇజ్రాయెల్ సైతం పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేసింది. ఇలా ప‌లుమార్లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పాక్‌కు ఉగ్ర‌వాద దేశంగా విమ‌ర్శ‌లు ఎదుర‌వ‌డం దేశ ప్ర‌తిష్ట‌కు ప్ర‌మాదంగా మారుతోంది. దీంతో పాటు ఈ వ్యాఖ్య‌లు ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ప‌లు ఉగ్ర‌స్థావ‌రాల‌ను కూల్చివేసింది. ప్ర‌స్తుతం వీటి పున‌ర్నిర్మాణం జ‌రుగుతోంద‌ని నిఘావ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఈ నేప‌థ్యంలో భార‌త సైన్యం మ‌రింత అప్ర‌మంత్తంగా ఉండాల్సిన అవ‌సరం ఉంది.

ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న పాకిస్తాన్‌ - Tholi Paluku