
ఉక్రెయిన్ యుద్ధంపై చేతులెత్తేసిన ట్రంప్?
అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్లు ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపుతామంటూ గొప్పలు చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందాలు, చర్చలు చేయలేక పక్కకు తప్పుకున్నట్లుగా స్పష్టమవుతోంది. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రుత్ సోషల్‌లో చేసిన పోస్ట్ ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఆయన ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలను వదిలేస్తున్నాడన్న ప్రచారం ఊపందుకుంది.
ఐరాసలో జెలెన్ స్కీ ఆందోళన
ఉక్రెయిన్ తన పూర్వ రూపాన్ని తిరిగి సాధిస్తుందని ట్రంప్ ఆశావహ దృక్పథంతో పోస్ట్ చేశారు. కానీ, ఇది సాధ్యమవ్వాలంటే యూరప్ ముందుండి సహాయం చేయాలని చెప్పారు. ఉక్రెయిన్ విజయానికి సమయం, ఓపిక, ఆర్థిక సహాయం అవసరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నాటో సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు. అమెరికా నాటోకు ఆయుధాలు సరఫరా చేస్తుందని, నాటో ఏం చేయాలనుకున్నా చేయవచ్చని ట్రంప్ సూచించారు. "అందరికీ గుడ్ లక్" అంటూ ట్రంప్ తన పోస్టును ముగించారు. ఇది శాంతి ఒప్పందం కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు వదిలేస్తున్నట్టు సూచిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచన కూడా వదిలేసినట్టు స్పష్టమవుతోంది. యూరప్ నేతృత్వంలో సమిష్టిగా ఈ అస్థిర పరిస్థితుల్లో భద్రత, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరముంది.
రష్యా కొద్ది రోజులుగా నాటో గగనతలంలోకి యుద్ధ విమానాలు, డ్రోన్లతో చొరబడుతోంది. ఈ డ్రోన్లు డెన్మార్క్ లోకి వచ్చి కోపెన్‌హాగన్ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండుసార్లు అంతరాయాన్ని కలిగించాయి. రష్యాతో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని నాటో దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ సెప్టెంబర్ 24న ఐరాస సాధారణ సభలో మాట్లాడుతూ డ్రోన్ యుద్ధాలు భవిష్యత్తులో భయంకర రూపం దాల్చుతాయని హెచ్చరించారు. పుతిన్ ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో సవాల్ విసురుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ ఈ సవాలును ఎదుర్కోవటానికి తన బలాన్ని చూపించటానికి సిద్ధంగా ఉందన్నారు. బ్రసెల్స్‌లోని ఈయూ సంస్థలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, ఉక్రెయిన్‌కు న్యాయమైన శాంతి కావాలని స్పష్టం చేశాయి. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సహా నాటో దేశాలు సమిష్టి సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు.
యూరప్ దేశాలతో సాధ్యమేనా?
యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి ఏర్పడిన కూటమి బలహీనంగా ఉంది. ఈ కూటమిలో నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా ఉన్నాయి. కానీ అమెరికా లేదు. ఈ కూటమి ఫిబ్రవరిలో 8 దేశాలతో మొదలై, ఏప్రిల్‌లో 33 దేశాలకు, సెప్టెంబర్‌లో 39 దేశాలకు పెరిగింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌కు సైనిక సామగ్రి సరఫరా చేస్తున్న 57 దేశాల ఉక్రెయిన్ రక్షణ సమూహానికి ఈ కూమితో సంబంధం స్పష్టంగా లేదు. ఈ కూటమి సెప్టెంబర్ మొదట్లో 30వ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో అన్ని దేశాలు ఒకే లక్ష్యంతో ఏకతాటిపై లేవు. కొన్ని దేశాలు ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తర్వాత సైనిక బలగాలు పంపడానికి సిద్ధంగా లేవు. సామర్థ్యం కూడా అందరికీ సమానంగా లేదు. ఈయూ, నాటో నాయకులు తమ సంస్థల్లోని అన్ని దేశాల తరపున మాట్లాడుతున్నారా అనేది అనుమానం కలిగిస్తోంది. హంగేరీ, స్లోవేకియా వంటి దేశాలు రష్యాకు వ్యతిరేకంగా రక్షణ విషయంలో స్పష్టమైన ధోరణి చూపించడం లేదు. ఈ దేశాలకు వేర్వేరు ప్రాధాన్యతలున్నట్లు తెలుస్తోంది.
నాటోలోని యూరప్ దేశాలు అమెరికా ఉక్రెయిన్ సహాయం నుంచి వెనక్కి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధం జరుగుతుందేమోనన్న భయం కూడా ఆయా దేశాల్లో ఉంది. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అమెరికా నుంచి ఆయుధాలు కొనడం ప్రారంభించారు. దీంతో ఉక్రెయిన్‌కు సామగ్రి సరఫరాలో లోటు కూడా భర్తీ అవుతుంది. కానీ ఇది యూరప్ సొంత రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగం లేని పనిగా మిగిలిపోతుంది. ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సహాయం గణనీయంగా తగ్గింది. యూరప్ ఈ లోటును పూర్తిగా భర్తీ చేయలేకపోతోంది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంలో జర్మనీ ముందు వరుసలో ఉంది. ద్రవ్యోల్బణం, దేశీయ ఖర్చుల వల్ల యూరోపియన్ యూనియన్ సాయం ఎంతకాలం కొనసాగుతుందన్నది చెప్పలేం. ఫ్రాన్స్ సైతం ఆర్థిక సమస్యల్లో ఉంది, స్పెయిన్ నాటో లక్ష్యంగా విధించిన 2 శాతం రక్షణ ఖర్చులను కూడా పాటించడం లేదు.
కూటమి ముందున్న సవాళ్లు
జెలెన్ స్కీ వ్యాఖ్యలతో యుద్ధం పశ్చిమ దేశాలకు వ్యాపిస్తుందన్న ఆందోళన ఆయా దేశాల్లో ఉంది. ఈ సవాళ్లను అధిగమించడానికి కూటమి దేశాలు, ఉక్రెయిన్‌తో సహా, రక్షణ పరిశ్రమలో సహకారాన్ని వేగవంతం చేయాలి. కాలక్రమంలో యూరప్ సొంతంగా సైనిక సామగ్రి ఉత్పత్తి చేసే సామర్థ్యం పెంచుకోవచ్చు. కానీ సైనికుల కొరత, రష్యా డ్రోన్ దాడుల ముప్పు, వాయు రక్షణ వ్యవస్థల బలోపేతం, దూరం దాడి సామర్థ్యాలు, అమెరికా గూఢచర్య సమాచారం లేకపోవడం వంటి సమస్యలు త్వరగా పరిష్కారం కావు. స్వంత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసి, అమెరికాను సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే యూరప్ ఇంకా కొన్ని సామర్థ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్‌కు రష్యాతో యుద్ధంలో సాయం చేస్తూ ఓడిపోకుండా చూడాలి. దీని కోసం యూరప్ ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి, సైనిక బలాన్ని పెంచాలి. ఇలా చేస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పశ్చిమ దేశాలతో పూర్తి సైనిక ఘర్షణగా మార్చకుండా అడ్డుకోవచ్చు.
ఉక్రెయిన్ శాంతి స్థాపనలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని వదిలేసినట్టు స్పష్టమవుతోంది. యూరప్ సమిష్టి సవాళ్లు, సమన్వయ లోపం, ఆర్థిక ఒత్తిళ్లు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలవన్న నమ్మకం లేదు. ట్రంప్ అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యి, యుద్ధం ముగించేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని ప్రణాళికలు వేశారు. ఇప్పుడు ఆయన శాంతి మధ్యవర్తిత్వం నుంచి పక్కకు తప్పుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ అన్ని భూభాగాలు తిరిగి తీసుకోగలదని, యూరప్ ముందుండాలని చెబుతున్నారు. పుతిన్‌తో భేటీ తర్వాత ట్రంప్ యూరప్ నాయకులతో మాట్లాడారు. ఉక్రెయిన్ డోన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు ఇస్తే శాంతి సాధ్యమని సూచించారు. దీనికి ఉక్రెయిన్ అంగీకరించలేదు. తర్వాత ట్రంప్ రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న చైనా, భారత్‌పై అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించారు. నాటో దేశాలకు కూడా ఇవే సూచనలు చేశారు. ఇది రష్యాను ఆర్థికంగా ఇబ్బందుల్లో పడేసి యుద్ధం ముగిసేందుకు సహకరిస్తుందని భావించారు. కానీ ట్రంప్ వ్యూహాలన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు యూరప్ దేశాలే నేరుగా రష్యాను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందోనని, జెలెన్ స్కీ చెప్పినట్లు యూరప్ దేశాలకు కూడా విస్తరిస్తుందా అని ప్రపంచ దేశాల్లో చర్చ నడుస్తోంది. అయితే ట్రంప్ ఈ విషయంలో స్థిరంగా ఉంటారని చెప్పలేం. మళ్లీ మనసు మార్చుకొని రష్యాపై విరుచుకుపడ్డా ఆశ్చర్యం లేదు.
