Let's talk: editor@tmv.in
ఉక్రెయిన్‌, గాజాలో శాంతికి కృషి చేస్తాం

ఉక్రెయిన్‌, గాజాలో శాంతికి కృషి చేస్తాం

Venkatesh Balusula
29 సెప్టెంబర్, 2025

ఉక్రెయిన్, గాజా యుద్ధాలు సత్వరమే ముగించాలని భారత్ ఐక్య రాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పిలుపునిచ్చింది. ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు ఎలాంటి సహకారం కావాలన్నా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రతి ఒక్కరం శాంతి, సమృద్ధికి కృషి చేయవచ్చు. ఉక్రెయిన్ గాజా సంఘర్షణలు నేరుగా సంబంధం లేని వారిపై కూడా ప్రభావం చూపాయి" అని జైశంకర్ వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడగల దేశాలు పరిష్కారాల కోసం ముందుకు రావాలని ప్ర‌పంచ నేత‌ల‌ను కోరారు. భారత్ యుద్ధాలను ఆపాలని కోరుకుంటుంద‌న్నారు. శాంతిని తీసుకురావడానికి సహాయపడే ఏ చర్యకైనా మద్దతు ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఉక్రెయిన్ పశ్చిమ ఆసియాలో రెండు పెద్ద సంఘర్షణలు జరుగుతున్నాయని, దీంతో ఇతర చిన్న సమస్యలు వార్తల్లోకి కూడా రావడం లేదని ఆయన చెప్పారు. 2022 నుంచి ఇంధనం ఆహార భద్రత సంఘర్షణల మొదటి బాధితాలు. ధనిక సమాజాలు తమను తాము కాపాడుకున్నాయి. వనరుల కొరత ఉన్న దేశాలు బతకడానికి పోరాడాయి. తర్వాత వాటికి ఉపదేశాలు వినాల్సి వచ్చింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022 నుంచి ఉక్రెయిన్, గాజా వంటి సంఘర్షణల వల్ల పెట్రోల్, గ్యాస్, ఆహార సరఫరా, లభ్యత తీవ్రంగా దెబ్బతిన్న‌ట్లు చెప్పారు. ఈ యుద్ధాలు జరిగిన ప్రాంతాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపాయ‌న‌న్నారు. ఆర్థికంగా బలమైన దేశాలు తమ వనరులను కాపాడుకోవడంలో ముందుండి, తమ అవసరాలను ముందుగా చూసుకున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ధ‌నిక దేశాల్లో ఇంధనం, ఆహారం లభించేలా చూసుకున్నాయి కానీ పేద దేశాలు ఈ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని తెలిపారు. చిన్న దేశాల్లో ధ‌ర‌లు పెరిగి, జనం బతకడానికే చాలా కష్టపడుతున్నార‌న్నారు. అంతర్జాతీయ వ్యవస్థలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థను క‌లిగి ఉన్న దేశాలు చిన్న దేశాల‌ను ఆదుకోవ‌డం ప‌క్క‌న‌పెట్టి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డానికే ప‌రిమిత‌మ‌వుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఉక్రెయిన్, గాజాలో యుద్ధాల వల్ల ఇంధనం, ఆహారం వంటి నిత్యావ‌స‌రాలు ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన‌స్థాయిలో అందడం లేదు. బలమైన దేశాలు తమను తాము కాపాడుకుంటుంటే, బలహీన దేశాలు కష్ట‌ప‌డుతూనే ఉన్నాయి.

భారత్ సహాయ సహకారాలు

భారత్ ఉక్రెయిన్‌కు మానవతా సహాయంగా 90 టన్నుల ఔష‌ధాలు, వైద్య సామగ్రి, సహాయ సామాగ్రిని పంపింది. గాజాకు 6.5 టన్నుల వైద్య సామ‌గ్రి, 32 టన్నుల విప‌త్తు నిర్వ‌హ‌ణ సామ‌గ్రిని అందించింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్య రాజ్య స‌మితి సహాయ సంస్థకు రెండుసార్లు ఆర్థిక సాయం అంద‌జేసింది. భవిష్యత్తులో భారత్ మరింత‌ వైద్య‌, ఆహార స‌హ‌కారం అందించేందుకు సిద్ధంగా ఉంది. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా ఉండ‌టానికి భార‌త్ సిద్ధ‌మేన‌న్న సూచ‌న‌లు ఇస్తుంది. భారత్ రాయబార కార్యాలయాలు, దౌత్య సంస్థల ద్వారా యుద్ధం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయగలదు. ఉక్రెయిన్ లేదా గాజాలో బాధితులకు ఆహారం, మందులు, ఆర్థిక సహాయం, ఇతర సామగ్రిని ఈ రాయబార కార్యాలయాల ద్వారా పంపవచ్చు. ఈ ప్ర‌య‌త్నాల‌తో ఇంకా ఇతర దేశాలతో సమన్వయం చేసి, బాధితుల‌కు స‌క్ర‌మంగా సాయం అందేలా చూడ‌వ‌చ్చు.

ఇప్పటి వరకు భారత్ వైఖరి

ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. రష్యాను ఖండించకుండా శాంతి కోసం పిలుపునిస్తోంది. ఐరాస ప్రవేశపెట్టిన ప్రతిపాదనల్లో చాలా వరకు ఓటు వేయకుండానే ఉంటోంది. గాజా సంఘర్షణలో శాంతి, ఇరు వర్గాల సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే దక్కాలని సూచిస్తోంది. మానవతా సాయానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగించాలని కోరుతోంది. ఇజ్రాయిల్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే పాలస్తీనా మద్దతు కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి పునరుద్ధరణకు మద్దతు ప్రకటించారు. గాజాపై సంఘర్షణలు ఆందోళనకరమన్నారు. శాంతి పరిష్కారాలకు సహకరిస్తామని తెలిపారు. జెలెన్‌స్కీతో దీని గురించి చర్చలు జరిపారు. ఉక్రెయిన్, గాజా యుద్ధ వ్యవహారంలో భారత్ దౌత్యపరమైన సమతుల్యతను పాటిస్తోంది. ఉక్రెయిన్, గాజా సంఘర్షణలపై శాంతికి పిలుపునిస్తూ బాధ్యతాయుతంగా నాయకత్వ పాత్ర స్పష్టం చేసింది. ఏ పక్షాన్ని సమర్థించకుండా అన్ని వైపులా మాట్లాడగల సామర్థ్యాన్ని ఉపయోగించి శాంతి చర్చలకు మద్దతు ఇవ్వడం భారత్ తటస్థ వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇంధనం, ఆహార భద్రతపై చేసిన వ్యాఖ్యలు అభివృద్ధి చెందుతున్న దేశాల సవాళ్లపై చర్చకు తెరలేపాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమను కాపాడుకుని ఇతరులకు ఉపదేశాలు చేయడంపై చేసిన‌ విమర్శలు అంతర్జాతీయ వ్యవస్థలో అసమానతలను ఎత్తి చూపాయి. గ్లోబల్ సౌత్ దేశాలకు గొంతుగా నిలుస్తూ భార‌త్ చేసిన వ్యాఖ్య‌లు అభినంద‌నీయం. ఉక్రెయిన్ యుద్దంపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సైతం చేతులెత్తేస్తున్న వేళ భార‌త్ ముందుకొచ్చి శాంతి స్థాప‌న‌కు కృషి చేద్దామ‌ని అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌పంచ నాయ‌కుల‌కు పిలుపునివ్వ‌డంతో ఈ యుద్ధాలు ముగించ‌డంలో భార‌త్ కీల‌క‌ పాత్ర పోషించ‌నుంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ఉక్రెయిన్‌, గాజాలో శాంతికి కృషి చేస్తాం - Tholi Paluku