Let's talk: editor@tmv.in
ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేది లేదు: ట్రంప్

ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేది లేదు: ట్రంప్

Yekkirala Akshitha
19 అక్టోబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో శనివారం వైట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం చాలా స్నేహపూర్వకంగా, ఆసక్తికరంగా జరిగిందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ఆయన జెలెన్‌స్కీ అడిగిన తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులు ఇవ్వడానికి నిరాకరించారు.

యుద్ధం ముగిసిపోవాలి

ఉక్రెయిన్‌కు తొమాహాక్‌లు అవసరమే రాకుండా, యుద్ధమే ముగిసిపోవాలి. అమెరికా తన ఆయుధ నిల్వలను కాపాడుకోవాలని ట్రంప్​ ఆకాంక్షించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు జరగాలని రక్తపాతం ఆగాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 17న ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రెండు గంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడారు. దానిని రెండు దేశాల అధికారులు “రూపకల్పనాత్మకంగా, పురోగతితో కూడినది”గా వర్ణించారు. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్ (హంగేరీ)లో సమ్మిట్ నిర్వహించాలనే ప్రతిపాదన రాగా అందుకు వారు అంగీకరించారు.ఇది నవంబర్ 2025లో జరిగే అవకాశం ఉంది. ఫోన్ సంభాషణలో కూడా ఉక్రెయిన్‌కు తొమాహాక్ క్షిపణుల సరఫరా విషయం ప్రస్తావనకు వచ్చింది. పుతిన్ ట్రంప్​ ను హెచ్చరించినట్లు ఉంది. ‘అవి యుద్ధ ఫలితాన్ని మార్చవు, కానీ అమెరికా–రష్యా సంబంధాలను దెబ్బతీస్తాయి అని అన్నారని రష్యా మీడియా పేర్కొంది.

భారత్‌ ప్రస్తావన కూడా

ట్రంప్ మాట్లాడుతూ భారత్ ఇప్పుడు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపేసింది అని పేర్కొన్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ దీనిని తప్పుగా పేర్కోన్నారు. భారత్‌ ముడి చమురు దిగుమతులు జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయని స్పష్టం చేశారు. మా ఇంధన విధానం వినియోగదారుల ప్రయోజనాలు, సరఫరా స్థిరత్వం పై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

యుద్ధ పరిస్థితి

రష్యా చిన్న స్థాయి భూభాగాలను మాత్రమే గెలిచింది. వాటి ఖరీదు ఎక్కువ.ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు తగ్గితే, రష్యాకు లాభం కలగవచ్చు.ఆయుధాల సరఫరా కొనసాగితే, ఉక్రెయిన్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి యుద్ధం స్తబ్ధంగా ఉంది — ఏ పక్షానికీ స్పష్టమైన విజయం కనబడడం లేదు.

ఇకచాలు..ఇంటికి వెళ్లండి

ప్రతివారం వేల మంది చనిపోతున్నారు. ఇక చాలు. ఇంటికి వెళ్లండి, శాంతియుతంగా జీవించండి అని ఆయన జెలెన్ స్కీతో అన్నారు.మొత్తం మీద ట్రంప్ పుతిన్‌తో సమ్మిట్‌ ద్వారా శాంతి ఒప్పందం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జెలెన్‌స్కీ కోరిన తొమాహాక్ క్షిపణులు మాత్రం ఇవ్వనని తెలిపారు. ఉక్రెయిన్‌ అమెరికా మద్దతుపై ఆధారపడే స్థితి కొనసాగుతూనే ఉంది.

ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేది లేదు: ట్రంప్ - Tholi Paluku