Let's talk: editor@tmv.in
ఉక్రెయిన్ ఇంధన శాఖలో కుంభకోణం.. దేశ సరిహద్దులో మాజీ మంత్రి అరెస్ట్

ఉక్రెయిన్ ఇంధన శాఖలో కుంభకోణం.. దేశ సరిహద్దులో మాజీ మంత్రి అరెస్ట్

Shaik Mohammad Shaffee
17 ఫిబ్రవరి, 2026

యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో భారీ అవినీతి కుంభకోణం కలకలం రేపుతోంది. సుమారు 100 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.906 కోట్లు) నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ మాజీ ఇంధన మంత్రి జర్మన్ గలుషెంకోను అధికారులు అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ఆయన రైలులో సరిహద్దు దాటుతుండగా ఉక్రెయిన్ జాతీయ అవినీతి నిరోధక బ్యూరో అధికారులు మాటువేసి పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనను తదుపరి విచారణ నిమిత్తం రాజధాని కీవ్‌కు తరలించారు.

'ఆపరేషన్ మిడాస్'తో బట్టబయలు

గలుషెంకో అవినీతిపై ఉక్రెయిన్ దర్యాప్తు సంస్థలు గత 15 నెలలుగా 'ఆపరేషన్ మిడాస్' పేరుతో రహస్య విచారణ చేపట్టగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ అణు విద్యుత్ సంస్థ 'ఎనర్హోటమ్' కాంట్రాక్టుల కేటాయింపులో గలుషెంకో క్రమ పద్ధతిలో 10 నుంచి 15 శాతం వరకు కమీషన్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా పోగుచేసిన భారీ సొమ్మును మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు, చివరకు శత్రు దేశమైన రష్యాకు కూడా మళ్లించినట్లు బలమైన ఆధారాలు లభించాయి. విచారణలో భాగంగా అధికారులు భారీగా నగదు నింపిన సంచులను స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా విడుదల చేయడం గమనార్హం.

జెలెన్‌స్కీ ప్రభుత్వానికి చిక్కులు

అవినీతిని అంతం చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఈ తాజా కుంభకోణం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్కామ్‌లో పేర్లు బయటకు రావడంతో ఇంధన మంత్రి గలుషెంకోతో పాటు, ఆయన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన హ్రీన్చుక్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు జెలెన్‌స్కీకి అత్యంత సన్నిహితుడైన ఆండ్రీ యెర్మాక్ ఇంటిపై దాడులు జరగడంతో ఆయన కూడా తన పదవికి స్వస్తి పలికారు. ఒకవైపు యుద్ధం జరుగుతుండగానే, మరోవైపు ఇలాంటి వరుస అవినీతి ఉదంతాలు బయటపడుతుండటంతో దేశంలో ఎన్నికలు నిర్వహించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే యుద్ధం కారణంగా ప్రస్తుతం ఎన్నికలను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం

రష్యా బాంబు దాడుల వల్ల ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని, చలికాలంలో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో.. ఇంధన శాఖ మంత్రే ఇన్ని కోట్లు వెనకేశారన్న వార్త ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. గతంలో మాజీ ఉప ప్రధాని ఒలెక్సీ చెర్నిషోవ్ కూడా అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు.

ఈయూలో చేరేందుకు కఠిన పరీక్ష

ఉక్రెయిన్ గనుక యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం పొందాలంటే, ఆ దేశంలో అవినీతిని పూర్తిగా తుడిచిపెట్టడం అత్యంత ముఖ్యం. అందుకే 'ఆపరేషన్ మిడాస్' పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులు చేసి, కీలక నేతలను అరెస్టు చేయడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తనపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలను మాజీ మంత్రి గలుషెంకో మొదటి నుంచీ ఖండిస్తూనే ఉన్నారు, దీనిపై తాను కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఈ అవినీతి మరకలను ఉక్రెయిన్ వదిలించుకోలేకపోతే, యూరోపియన్ యూనియన్‌లో చేరడం ఆ దేశానికి కష్టంగా మారే అవకాశం ఉంది.

ఉక్రెయిన్ ఇంధన శాఖలో కుంభకోణం.. దేశ సరిహద్దులో మాజీ మంత్రి అరెస్ట్ - Tholi Paluku