
ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఏకంగా 948 డ్రోన్లతో దాడి!
రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం మరో భయానక ఘట్టానికి చేరుకుంది. గత 24 గంటల్లో రష్యా మున్నెన్నడూ లేని విధంగా ఏకంగా 948 డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. యుద్ధం ప్రారంభమైన ఈ నాలుగేళ్ల కాలంలో ఒకే రోజులో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. సాధారణంగా రాత్రి వేళల్లో దాడులు చేసే రష్యా, ఈసారి పట్టపగలే డ్రోన్ల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
పశ్చిమ ఉక్రెయిన్‌లో విధ్వంసం
రష్యా సరిహద్దులకు దూరంగా ఉండి, ఇప్పటివరకు కొంత ప్రశాంతంగా ఉన్న పశ్చిమ ఉక్రెయిన్ నగరాలను ఈసారి క్రెమ్లిన్ ప్రధానంగా లక్ష్యం చేసుకుంది. ముఖ్యంగా లివివ్ నగరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన 16వ శతాబ్దపు 'బెర్నార్డైన్ మొనాస్టరీ' డ్రోన్ దాడిలో దెబ్బతింది. మొనాస్టరీ సమీపంలోని నివాస భవనాల్లో మంటలు చెలరేగగా, సుమారు 32 మంది గాయపడినట్లు మేయర్ ఆండ్రీ సడోవీ తెలిపారు. ఇవానో-ఫ్రాంక్విస్క్ నగరంలో ఓ ప్రసూతి ఆసుపత్రిపై డ్రోన్లు పడ్డాయి. ఈ ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి సహా పలువురు గాయపడగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టెర్నోపిల్, విన్నిట్సియా నగరాల్లోనూ నేరుగా డ్రోన్లు భవనాలను ఢీకొట్టాయి. విన్నిట్సియాలో ఒకరు మరణించగా, 13 మంది గాయపడ్డారు.
వరుస కట్టిన డ్రోన్లు.. 34 క్షిపణులతో దాడి
మంగళవారం ఉదయం నుండే రష్యా డ్రోన్లు ఉత్తర దిశ నుంచి 'వరుసలు' కట్టి ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి యూరీ ఇగ్నాట్ తెలిపారు. రాత్రిపూట జరిగిన దాడుల్లో 392 డ్రోన్లు, 34 క్షిపణులను ప్రయోగించగా.. ఉదయం నుంచి మరో 556 డ్రోన్లను రష్యా వదిలింది. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలు మెజారిటీ డ్రోన్లను కూల్చివేసినప్పటికీ, అనేక చోట్ల నేరుగా భవనాలపైకి డ్రోన్లు దూసుకురావడంతో విధ్వంసం తప్పలేదు.
యుద్ధం ఆపే ఉద్దేశం రష్యాకు లేదు: జెలెన్‌స్కీ
ఈ అమానుష దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. "ఇంత భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. రష్యాకు ఈ యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఏమాత్రం లేదని" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా స్పందిస్తూ.. "ప్రపంచం రోజూ వార్తల్లో మునిగిపోతుండవచ్చు, కానీ ఉక్రెయిన్ అనుభవిస్తున్న ఈ శోకాన్ని కేవలం ఒక గణాంకంగానో, హెడ్‌లైన్‌గానో మారిపోనివ్వం" అని భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
మరోవైపు ఉక్రెయిన్.. రష్యాపై మునుపెన్నడూ లేనంత పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. రష్యాలోని 13 ప్రాంతాలతో పాటు క్రిమియా ద్వీపకల్పంపైకి వచ్చిన 389 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని నివేదికలు చెబుతున్నాయి.
స్తంభించిన శాంతి చర్చలు
ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, ఉక్రెయిన్-రష్యా మధ్య అమెరికా ఆధ్వర్యంలో జరగాల్సిన శాంతి చర్చలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోవైపు, రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, 13 మంది గాయపడినట్లు రష్యా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నా, రష్యా మాత్రం డ్రోన్ల ప్రవాహంతో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
