Let's talk: editor@tmv.in
ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల రుణ ప్యాకేజీకి ఈయూ గ్రీన్ సిగ్నల్

ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల రుణ ప్యాకేజీకి ఈయూ గ్రీన్ సిగ్నల్

Shaik Mohammad Shaffee
13 ఫిబ్రవరి, 2026

రష్యాతో నాలుగేళ్లుగా సాగుతున్న హోరాహోరీ పోరాటంలో ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మరో భారీ ముందడుగు వేసింది. ఉక్రెయిన్ ఆర్థిక, రక్షణ అవసరాల కోసం ఏకంగా 90 బిలియన్ యూరోల (భారత కరెన్సీలో సుమారు రూ.9.67 లక్షల కోట్లు) భారీ రుణ ప్యాకేజీని యూరోపియన్ పార్లమెంటు బుధవారం ఆమోదించింది. ఈ నెలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఉక్రెయిన్ అత్యవసర అవసరాలను తీర్చేందుకు ఈ నిధులను 2026, 2027 సంవత్సరాల్లో అందించనున్నారు. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 458 ఓట్లు రాగా, 140 మంది వ్యతిరేకించారు.

రక్షణ రంగానికి పెద్దపీట

ఈ భారీ ప్యాకేజీలో నిధులను రెండు ప్రధాన భాగాలుగా విభజించారు. అందులో 30 బిలియన్ యూరోలను ఉక్రెయిన్ బడ్జెట్ అవసరాలకు, పాలనాపరమైన ఖర్చులకు కేటాయించనున్నారు. మిగిలిన 60 బిలియన్ యూరోలను (దాదాపు 70 శాతం నిధులు) పూర్తిగా ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి వినియోగిస్తారు. యుద్ధ విమానాలు, క్షిపణులు, ఇతర సైనిక పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెన్నెముకగా నిలవనున్నాయి. ప్రాథమికంగా యూరప్ దేశాల నుంచి రక్షణ సామాగ్రిని సేకరించాలని, ఒకవేళ అత్యవసరంగా అక్కడ అందుబాటులో లేకపోతే ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు.

కఠిన నిబంధనలు.. పారదర్శకత

ఈ నిధుల విడుదలపై యూరోపియన్ కమిషన్ కొన్ని కీలక షరతులను విధించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటంతో పాటు, చట్టబద్ధమైన పాలన, మానవ హక్కుల రక్షణ, అవినీతి నిర్మూలన వంటి సంస్కరణలను నిరంతరం కొనసాగించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ సిద్ధం చేసే ఆర్థిక ప్రణాళికను యూరోపియన్ కమిషన్ మదింపు చేసి, కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే విడతల వారీగా నిధులు విడుదలవుతాయి. 2026 రెండో త్రైమాసికం నుంచి మొదటి విడత నిధులు అందే అవకాశం ఉంది.

రష్యా చెల్లించాల్సిందే

ఈ రుణానికి సంబంధించిన వడ్డీ, ఇతర ఖర్చులను యూరోపియన్ కమిషన్ భరించనుంది. 2027లో వడ్డీ ఖర్చులు సుమారు 1 బిలియన్ యూరోలుగా ఉంటాయని, 2028 నుంచి ఏటా 3 బిలియన్ యూరోలు అవుతాయని అంచనా. అయితే ఉక్రెయిన్ ఈ అసలు మొత్తాన్ని రష్యా నుంచి యుద్ధ పరిహారం అందిన తర్వాతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఈ యుద్ధం వల్ల కలిగిన నష్టానికి రష్యా బాధ్యత వహించేలా నిబంధనలను రూపొందించడం గమనార్హం.

ఐక్యతకు నిదర్శనం: జెలెన్‌స్కీ

యూరోపియన్ పార్లమెంటు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. "దురాక్రమణదారులకు పంపాల్సిన సరైన సంకేతం ఇదే. ఉక్రెయిన్ నిలబడుతుంది.. తన ప్రజలను కాపాడుకుంటుంది. ఐరోపా దేశాలన్నీ ఐక్యంగా, బలంగా ఉన్నాయని ఈ నిర్ణయం నిరూపించింది. రష్యా చెల్లించాల్సిన నిధులతోనే ఉక్రెయిన్ రక్షణ సాగుతోంది" అని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

ముగింపు దశకు ప్రక్రియ

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో ఈ 90 బిలియన్ యూరోల ప్యాకేజీపై ప్రాథమిక అవగాహన కుదిరింది. తాజాగా పార్లమెంటు ఆమోదంతో ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ఇప్పుడు కౌన్సిల్ నుంచి లాంఛనప్రాయంగా తుది ఆమోదం లభించిన వెంటనే నిధుల విడుదల ప్రక్రియ మొదలవుతుంది. ఉక్రెయిన్ తన రక్షణ కోసం అంచనా వేస్తున్న మొత్తం ఆర్థిక అవసరాల్లో ఈ ప్యాకేజీ మూడింట రెండు వంతుల భారాన్ని తీర్చనుంది.