
ఉక్రెయిన్‌కు హంగేరీ 'గ్యాస్' సరఫరా నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏట అడుగుపెట్టిన తరుణంలో ఐరోపాలో ఇంధన సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. తమ దేశానికి రావాల్సిన రష్యా చమురు సరఫరాను ఉక్రెయిన్ పునరుద్ధరించే వరకు, ఉక్రెయిన్‌కు తాము అందిస్తున్న సహజ వాయువు (గ్యాస్) సరఫరాను నిలిపివేస్తామని హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బన్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ మీదుగా సాగే 'ద్రుజ్బా' పైప్‌లైన్ ద్వారా రష్యా నుంచి హంగేరీ, స్లోవేకియా దేశాలకు రావాల్సిన చమురు సరఫరా గత రెండు నెలలుగా నిలిచిపోవడమే ఈ వివాదానికి కారణమైంది.
'బ్లాక్ మెయిల్' రాజకీయాలు వద్దు: ఆర్బన్
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆర్బన్ ఉక్రెయిన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఉక్రెయిన్ మాకు చమురు సరఫరా చేయనంత కాలం, హంగేరీ నుండి వారికి గ్యాస్ అందదు. ఇది ఉక్రెయిన్ చేస్తున్న బ్లాక్ మెయిల్" అని ఆయన మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు పంపాల్సిన గ్యాస్‌ను తమ సొంత నిల్వలను నింపుకోవడానికి ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపు 38 నుండి 45 శాతం వరకు హంగేరీ నుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, తాజా నిర్ణయం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
పైప్‌లైన్ మరమ్మతులపై ప్రతిష్టంభన
రష్యా డ్రోన్ దాడుల వల్ల పైప్‌లైన్ దెబ్బతిందని, నిరంతరం దాడులు జరుగుతుండటం వల్ల సాంకేతిక నిపుణుల ప్రాణాలకు ముప్పు ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. అందుకే చమురు సరఫరా నిలిచిపోయిందని స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ కావాలనే సరఫరాను అడ్డుకుంటోందని హంగేరీ, స్లోవేకియా దేశాలు ఆరోపిస్తున్నాయి. రష్యా చమురు తమ దేశం మీదుగా వెళ్లడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా గతంలో అయిష్టత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హంగేరీ ఉక్రెయిన్‌కు అందాల్సిన 90 బిలియన్ యూరోల ఈయూ రుణాన్ని కూడా అడ్డుకుంది.
అంతర్గత రాజకీయాల ప్రభావం
వచ్చే నెల ఏప్రిల్ 12న హంగేరీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఆర్బన్ తన ప్రచారాన్ని ఉక్రెయిన్ వ్యతిరేక అంశాలపైకి మళ్లించారు. ఉక్రెయిన్‌ను ఒక 'శత్రు దేశం'గా పేర్కొంటూ, తనను ఎన్నికల్లో ఓడించడానికి జెలెన్ స్కీ ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. భద్రత పేరుతో హంగేరీలోని కీలక ఇంధన కేంద్రాల వద్ద సైన్యాన్ని కూడా మోహరించారు. రష్యాపై ఈయూ విధిస్తున్న ఆంక్షలను వ్యతిరేకించే ఆర్బన్, ప్రస్తుత చమురు వివాదంతో ఉక్రెయిన్‌పై మరింత ఒత్తిడి పెంచుతున్నారు.
