
ఉండవల్లిలో సీఎం నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ
ఏపి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భ౦గా ఇరువురి నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలకి అనుగుణంగా వీరు ఈ సమావేశంలో పలు అంశాలపై దృష్టి పెటారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. జల్ జీవన్ మిషన్ కింద జరుగుతున్న పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా చేసిన కేటాయింపులపై చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీల్లో అమలు చేస్తున్న ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పనుల వివరాలను ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబుకు వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మిస్తే పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా అమలు చేయవచ్చని సూచించారు. అలాగే, నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించారు. వేసవిలోనే పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్ట్’ వివరాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు మేలు చేసే విధంగా పనులను వేగవంతం చేయాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
