
ఈ శతాబ్దం భారతీయులదే: పీఎం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మొత్తం రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, కొన్నింటికి శంకుస్థాపనలు వేసి, దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు పరిశ్రమ, విద్యుత్ ప్రసారం, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం మరియు సహజ వాయువు వంటి కీలక రంగాల్లో ఉన్నాయి. ఈ సభలో మోడీ మట్లాడుతూ దేశాభివృద్ధి పై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ వేగంతో కొనసాగితే వికసిత్ భారత్–2047 లక్ష్యం ఈ శతాబ్దం నాటికి తప్పకుండా నెరవేరుతుందన్నారు.
21వ శతాబ్దం భారత్‌ది అవుతుంది. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం అవుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఆంధ్రకు కావాల్సింది సరైన దృష్టి, నాయకత్వం. నేడు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు. వీరిద్దరి వద్ద ఆ సామర్థ్యం ఉంది. వీరికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉంది అని మోడీ అన్నారు.
16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి రథం వేగంగా దూసుకుపోతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా భారీ అభివృద్ధి జరిగింది. నేడు ఢిల్లీ, అమరావతి కలసి శరవేగంగా ప్రగతి దిశగా పయనిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఈ వేగం కొనసాగితే–2047 నాటికి వికసిత్ భారత్ అవుతుందని అన్నారు.
తరువాత ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ₹13,430 కోట్లు విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, అంకితం కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రారంభించిన ప్రాజెక్టులు
• *కర్నూలు–3 పూలింగ్ స్టేషన్‌లో ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ బలోపేతానికి – రూ.2,880 కోట్లు
•
• *ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలు – రూ.4,920 కోట్లు
•
• *సబ్బవరం–శీలానగర్ ఆరు లైన్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు – రూ.960 కోట్లు
•
• *కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్, పెందుర్తి–సింహాచలం నార్త్ ఫ్లై ఓవర్‌కు – రూ1,200 కోట్లు
•
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని నిమ్మకూరు వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ఫ్యాక్టరీని ప్రారంభించి, భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో కీలక అడుగు వేసినట్టు పేర్కొన్నారు.
ఈ కర్మాగారం ద్వారా నైట్ విజన్ పరికరాలు, క్షిపణి సెన్సార్లు, డ్రోన్ గార్డ్ సిస్టమ్స్ వంటి ఆధునిక ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలను తయారు చేయనున్నారు. రూ. 362 కోట్లతో భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)ఈ వసతులను నిర్మించింది. ఇది రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే కాకుండా ప్రాంతీయంగా నైపుణ్య ఉపాధిని కూడా పెంపొందిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.
మోదీ మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ తయారు చేసిన పరికరాల శక్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కర్నూలును దేశ డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు సాంకేతిక రంగాలకు బాటలు వేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం అందుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వమే కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్ర సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వశక్తితో దేశంలో కొత్త శక్తిగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు.
తర్వాత ప్రధాని మోదీ, రూ. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వీటిలో పరిశ్రమ, విద్యుత్ ప్రసారం, రహదారులు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు రంగాలు ఉన్నాయి. ప్రధాని చివరగా ఈ వేగంతో అభివృద్ధి కొనసాగితే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నం నిజమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదించారు. ప్రధానిని సభ అనంతరం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
మోడీతోనే దేశం శక్తివంతం; సీఎం చంద్రబాబు నాయుడు
భారత్ మాతకీ జై, తెలుగుతల్లికి జై అని సభికులతో సీఎం చంద్రబాబు జై అంటూ పలికించారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఙతలు తెలిపారు.
ఎన్నో సభలు చూశా ఇప్పటివరకు. కానీ ఇంతటి జనాన్ని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు. శ్రీశైలంలో ప్రధాని పూజలు చేశారు. ఆ శక్తి సాక్షిగా ఇక్కడ ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పుట్టిన జిల్లా కర్నూలు అని గుర్తు చేశారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, ఇందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇక్కడి రావడం చరిత్రలో ప్రజలకు గుర్తుంటుంది. ప్రధాని తన జీవిత కాలంలో 25 సంవత్సారాలు ప్రజాసేవ చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా, పీఎంగా ప్రజలకు అనేక సేవలు చేశారని కొనియాడారు. మోడీ లాంటి నాయకుడు దేశానికి అవసరం. నేను అనేకమంది ప్రధాని మంత్రులతో పనిచేశాను. కానీ మోడీ లాంటి నాయకుడిని చూడలేదన్నారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారన్నారు. 2047 కల్లా ఇండియా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని, అది నరేంద్ర మోడీతోనే సాధ్యమన్నారు. నేను మీ పని విధానాన్ని దగ్గరి నుంచి చూశానని తెలిపారు. 2038 కల్లా రెండో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందన్నారు.
ప్రధాని మాటల్లో కాదు.. చేతల్లో చూయించారు
ఆపరేషన్ సింధూర్ తో మన బలం నిరూపించామన్నారు. మాటలుకాదు చేతల్లో ప్రధాని చూయించారు. దీంతో సభికులంతా మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ ఇది జీఎస్టీ ప్రధాన లక్ష్యం. 99 శాతం అన్ని వస్తువులపై పన్నులు తగ్గాయి. ప్రతి వర్గానికి దీని ద్వారా లాభం జరుగుతుంది. దీని వల్ల రూ.15వేలు సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఆదా అవుతాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ జీఎస్టీ తో సూపర్ సేవింగ్స్ తో సూపర్ హిట్ అయ్యాయి. జరిగాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రస్తుతం యుద్ధాలు, టారిఫ్ లు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో మోడీ స్వదేశీ మంత్రం తీసుకొచ్చారు. సెమీ కండక్టర్లనుంచి శాటిలైట్ వరకు చిప్ నుంచి షిప్ వరకు ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. 16 నెలల్లో కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం. పొలవరాన్ని గాడినపెట్టాం, విశాఖ ఉక్కును బలోపేత చేశాం. పెద్ద మొత్తంలో పెట్టుబడులు సాధించాం. విశాఖకు గూగుల్ ను తీసుకొచ్చాం. సెమీకండక్టర్, క్వాంటం వ్యాలీని మనకిచ్చారు. థ్యాంక్యూ మోడీజీ అంటూ బాబు ఉర్రూతలూగించారు. ఆధునిక ఆలయాలైన జలశయాలు సిరులు పండిస్తున్నాయి. రాయలసీమ హర్టికల్చర్ హబ్ గా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. హైకోర్టు బెంచ్ కర్నూలుకు వస్తోంది. కడపకు స్టీల్ ప్లాంట్, డిఫెన్స్ కారిడార్, స్పేస్ సీటి, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తాం. రాయలసీమ మొత్తానికి గ్రీన్ ఎనర్జీ, పుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ప్రధాని చేతుల మీదుగా విద్యుత్, రైల్వే,హైవే, ఢిపెన్స్ 13,430 కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం. కొప్పర్తిలో రూ.4922 కోట్ల విలువైన ఇండ్రిస్టియల్స్ వస్తున్నాయి. మేమందరం ప్రధాని నరేంద్రమోడీకి శక్తి ఇవ్వాలని, బీహార్ లో ఎన్డీయే గెలవాలని, ఆయన విజయయాత్ర నిర్విరామంగా కొనసాగాలని కోరుతున్నా, మోడీకి ఆ శ్రీశైల మల్లన్న ఆశీస్సులు ఉండాలన్నారు. 5 కోట్ల ఆంధ్రుల తరపున మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. సీఎం చంద్రబాబు. వేదిక పై గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , కేంద్ర, రాష్ట్ర మంత్రులు నారాలోకేష్, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, బీజేపీ, కూటమి, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు ఉన్నారు.
ప్రధాని మోడీ ఓ కర్మయోగి: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఏ ఫలితాలు ఆశించకుండా దేశసేవే పరమావధిగా,ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ తరంలో పనిచేస్తున్న కర్మయోగి దేశ ప్రధాని నరేంద్రమోడీ అని పవన్ కల్యాణ్ ప్రధాని అని కొనియాడారు. ప్రభుత్వాన్నే కాదు రెండు తరాలను ఆయన నడుపుతున్నారన్నారు. దేశాన్ని ఆత్మనిర్భర భారత్ దిశగా పయనింపజేస్తున్నారన్నారు. దేశాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన వ్యక్తి మోడీ గారన్నారు. ఓర్వకల్లులో రూ.4 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. జీఎస్టీ వల్ల సామాన్యులకు ఉపశమనం కలుగుతుంది.ఇన్సూరెన్స్ లపై కూడా జీఎస్టీ తగ్గించడం అభినందనీయమని తెలిపారు.
15 సంవత్సరాలకు తక్కువ కాకుండా కూటమి బలంగా ఉండాలన్నారు. ప్రజల్లో కూటమి ఉందనే ధైర్యం కలగలన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు వెళతామన్నారు.
ప్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు: నారా లోకేష్
పౌరుషాల గడ్డ కర్నూల్ జిల్లా. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి, ముతుకూరు గౌడప్ప జన్మించిన నేల, రాజసం నిండిన కోట కొండారెడ్డి బురుజు. ప్రధాని ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే అని నరేంద్రమోడీని ప్రశంసించారు. 25 సంవత్సరాలు అధికారంలో ఉన్న నేటికీ అదే ఉత్సాహంతోనే పనిచేస్తున్నారు. గుజరాత్ ను అభివృద్ధి దిశలో నడిపారు. దేశాన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకువెళుతున్నారు. పహల్గాం దాడికి బదులుగా పాకిస్థాన్ కు ధీటుగా బదులిచ్చారు. గతంలో ఐక్యరాజ్యసమితి దగ్గరికి వెళ్లేవారు. కానీ నరేంద్రమోడీ ఆపరేషన్ సింధూర్ తో ప్రత్యర్థిని గడగడలాడించారు. ప్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. ఆయన గుండె ధైర్యం ఆత్మనిర్భర భారత్. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ తో అన్ని పండుగలు ఒకే సారి తీసుకొచ్చారు. జీఎస్టీలో సంస్కరణల వల్ల ఆదాయం తగ్గినా, ప్రజలకు మేలు కలగాలన్నారు. మన ధైర్యం మోడీ. మన ప్రజల చిరునవ్వే ప్రధానికి పండుగ. పేదరికం లేని దేశమే ప్రధాని లక్ష్యం. జీఎస్టీ తగ్గించాలన్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మనకు 8 వేల కోట్ల రూపాయలు తగ్గినా ప్రజలకు మేలు జరగాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు మన సీఎం చంద్రబాబు సూచించారు. మనది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటూ కూటమిని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన పరిశ్రమలను గురించి వివరించారు.పదో స్థానం నుంచి నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని ప్రధాని నిలబెట్టారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జొడెద్దులని గుర్తు చేశారు.
శ్రీశైలంలో ప్రధాని నరేంద్రమోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల్ జిల్లాలో కోలువై ఉన్న శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి, ధ్వజస్థంభానికి మొక్కారు. ఈ సందర్భంగా ఆయన దేవస్థానంలో పూజలు నిర్వహించి సతీసమేతుడైన శ్రీశైల మల్లికార్జునుడిని, భ్రమరాంబను దర్శనం చేసుకున్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానితోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే ప్రాంగణంలోనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
శివాజీ స్పూర్తి కేంద్రం సందర్శన
ప్రధాని మోదీ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఈ స్మారక కేంద్రంలో ధ్యాన మందిరం ఉంది. ఇందులో నాలుగు ప్రతిష్టాత్మక కోటల (ప్రతాప్‌గడ్, రాజ్‌గడ్, రాయ్‌గడ్, శివనేరి) నమూనాలు నాలుగు మూలల్లో ఉన్నాయి. కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యానంలో మునిగి ఉన్న విగ్రహం ఉంది.
ఈ కేంద్రాన్ని శ్రీ శివాజీ స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇది 1677లో శివాజీ మహారాజు శ్రీశైలంలోని ఆలయాన్ని సందర్శించినందుకు ఈ కేంద్రాన్ని స్థాపించారు.
అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తదితరులు ప్రధాని మోడీకి కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్స్ లో హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ పోస్ట్ చేశారు.
