
ఈ నెల17న మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నెల 17న మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటన జిల్లా అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్య, మౌలిక వసతుల రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ఈ పర్యటన సాగనుందని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమాలు జిల్లా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేలా ఉంటాయని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్న నేపథ్యంలో సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. సభా ప్రాంగణం సిద్ధం చేయడం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు, వైద్య సేవలు వంటి అంశాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
సమీక్షా సమావేశం అనంతరం ఐఐఐటీ కళాశాల నిర్మాణం చేపట్టనున్న చిట్టబోయినపల్లి ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న ఎంవిఎస్ కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ఏర్పాట్లు, వేదిక, పార్కింగ్, ప్రజల సౌకర్యాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ పర్యటనతో మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు మెరుగైన విద్యా, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
