Let's talk: editor@tmv.in
ఈ నెల12న దేశవ్యాప్త నిరసనకు హిమాచల్ ఆపిల్ రైతుల పిలుపు

ఈ నెల12న దేశవ్యాప్త నిరసనకు హిమాచల్ ఆపిల్ రైతుల పిలుపు

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

కేంద్ర ప్రభుత్వం పలు దేశాలతో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) దేశీయ ఆపిల్ రైతుల జీవనాధారానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని హిమాచల్ ప్రదేశ్‌లోని ఆపిల్ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మె, నిరసనల్లో పాల్గొనాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కొట్కాయి ప్రాంతం ఖానేటీలో ఆదివారం హిమాచల్ ఆపిల్ గ్రోవర్స్ అసోసియేషన్ (హాగా) ఆధ్వర్యంలో బ్లాక్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆపిల్ రైతులు హాజరయ్యారు. స్థానిక కమిటీ సభ్యుడు రాకేశ్ మెహతా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు సంజయ్ చౌహాన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా సంజయ్ చౌహాన్ మాట్లాడుతూ, భూముల కోల్పోవడం, సాగు ఖర్చులు భారీగా పెరగడం, రైతు వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌టీఏలను ముందుకు తీసుకురావడం వల్ల తక్కువ ధరలతో విదేశీ ఆపిల్ దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించి, స్థానిక తోటలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఏల కారణంగా దేశీయ రైతులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఇది వారి జీవనాధారాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతిపాదిత కొత్త సీడ్ బిల్, ఎంజీఎన్‌రేగా కేటాయింపుల తగ్గింపు, స్మార్ట్ మీటర్ పథకం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్)కు బడ్జెట్ మద్దతు తగ్గింపులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యలన్నీ రైతులు, తోటల సాగుదారుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు.

రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చౌహాన్ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మె, నిరసనలు కీలకమైనవని అన్నారు. సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం, కొట్కాయి ప్రాంతానికి చెందిన ఆపిల్ రైతులు ఫిబ్రవరి 12న రోహ్రూలో నిర్వహించే నిరసనలో పాల్గొననున్నారు. అలాగే ఫిబ్రవరి 23న ఖానేటీలో జరగనున్న హిమాచల్ ఆపిల్ గ్రోవర్స్ అసోసియేషన్ కొట్కాయి సదస్సును విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. గ్రామ స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడం, ఎక్కువ మంది తోటల సాగుదారులను ఉద్యమంలో భాగస్వాములను చేయడం కోసం కార్యాచరణ రూపొందించాలని కూడా సమావేశం నిర్ణయించింది.