Let's talk: editor@tmv.in
ఈ నెల‌10న నాగార్జునసాగర్‌లో ‘వరుణ యాగం’.. హాజరుకానున్న సీఎం రేవంత్

ఈ నెల‌10న నాగార్జునసాగర్‌లో ‘వరుణ యాగం’.. హాజరుకానున్న సీఎం రేవంత్

Gaddamidi Naveen
8 ఆగస్టు, 2026

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణ యాగం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తంలో ఈ యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలోని విజయవిహార్ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితుల పర్యవేక్షణలో ప్రత్యేక వేద మంత్రోచ్చారణలతో యాగం జరగనుంది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు, జలాశయాలు, చెరువులు సమృద్ధిగా నిండాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. యాగం అనంతరం మధ్యాహ్నం 3.24 గంటలకు నిర్వహించే మహా పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఈ వరుణ యాగాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి సాగునీటి వనరులు పుష్కలంగా నిండాలని, రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ ఉత్పత్తి పెరగాలని సంకల్పంతో ఈ ప్రత్యేక వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.