Let's talk: editor@tmv.in
ఈ నెల 31లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఈ నెల 31లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Gaddamidi Naveen
26 మార్చి, 2026

తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన లక్షకు పైగా ఇళ్లను ఈ నెల 31వ తేదీలోగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం శాసనసభలో ప్రకటించారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, రాష్ట్రంలో సుమారు 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మార్చి 31 నాటికి పూర్తి కానున్నాయి. వీటికి అదే రోజున భారీస్థాయిలో గృహ ప్రవేశ కార్యక్రమాలు పూజలు నిర్వహించబడతాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూన్ నెల నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, ప్రత్యేకంగా ఐటీడీఏ పరిధిలోని చెంచు గిరిజనులు, ఇతర గిరిజన తెగల కోసం అదనంగా 12,000 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ హయాంలో తెలంగాణలోని 10 జిల్లాల్లో 21 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చామని గుర్తుచేశారు.

ఎంపిక ప్రక్రియలో పారదర్శకత

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ స్థాయిలో సర్పంచ్ ఛైర్మన్‌గా 'ఇందిరమ్మ హౌసింగ్ కమిటీలు' పనిచేస్తాయని మంత్రి ప్రకటించారు. కమిటీ ఎంపిక చేసిన నిరుపేదల జాబితాను జిల్లా కలెక్టర్ సమీక్షిస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తెలిపిన తర్వాతే ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, నిధులు లేక అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లకు కూడా నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, దీనిపై కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 14-15 ప్రాంతాలను గుర్తించామని, నగరంలోని పేదలకు అక్కడ ఇళ్లు నిర్మిస్తామని, ఇదే నమూనాను రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల్లోనూ అమలు చేస్తామని వివరించారు.

బడ్జెట్ అంచనాలు - డిప్యూటీ సీఎం వివరణ

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 22,500 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. బడ్జెట్‌లో నిధులు తగ్గించామన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించి, అత్యంత పారదర్శకంగా దరఖాస్తులను స్వీకరించామని, ప్రతి అర్హులైన పేదవాడికి ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ నెల 31లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి - Tholi Paluku