Let's talk: editor@tmv.in
ఈ నెల 29న ‘దీక్షా దివస్’ ఘనంగా నిర్వహించాలి: కేటీఆర్

ఈ నెల 29న ‘దీక్షా దివస్’ ఘనంగా నిర్వహించాలి: కేటీఆర్

Gaddamidi Naveen
23 నవంబర్, 2025

తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచిన 'దీక్షా దివస్'ను ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, సుమారు దశాబ్దంన్నర క్రితం,బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అనే నినాదంతో గొప్ప త్యాగ నిరతితో దీక్ష చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము.ఆ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గదర్శకంగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.

సన్నాహక సమావేశాలు 26న

దీక్షా దివస్‌కు ముందుగా నవంబర్ 26న అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా కీలక నాయకులను ఆహ్వానించాలని ఆయ‌న‌ సూచించారు. ఈ సమావేశాల ద్వారా నవంబర్ 29న జరగనున్న కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని తెలిపారు.

ప్రత్యేక అలంకరణలు

కేటీఆర్‌ సూచనల ప్రకారం 28వ తేదీ సాయంత్రంలోగా జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయాలను సుందరీకరించాలన్నారు. కనీసం వెయ్యి మంది కీలక పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకుని స్థానిక నాయకత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి, అమర వీరుల స్థూపాలకు నివాళులు అర్పించి, అనంతరం కేసీఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలని ఆయ‌న‌ తెలిపారు.

ఫోటో ఎగ్జిబిషన్ – ఉద్యమ స్ఫూర్తి పునర్జీవనం

దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమానికి సంబంధించిన కీలక సంఘటనలు, వార్తలు, చారిత్రక క్షణాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శన ప్రతి జిల్లా కేంద్రంలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. కేంద్ర కార్యాలయం నుంచి ఫోటోలు పంపబడతాయని, స్థానిక జిల్లాల్లో ఆ సమయంలో జరిగిన సంఘటనలు, పత్రికా కవరేజ్ క్లిప్పింగ్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయ‌న‌ సూచించారు. కేవలం రాజకీయ ప్రసంగాలు కాకుండా ఆనాటి ఉద్యమ స్మృతులను, పునరుద్ధరించేలా వక్తలను ఎంపిక చేసి వారి సమయాన్ని ముందుగానే ఖరారు చేయాలని ఆయన అన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలు – విద్యార్థి, యువ విభాగాల చురుకుదనం

దీక్షా దివస్ రోజున పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చు అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పండ్ల పంపిణీ నిర్వహించనున్నట్లు చెప్పారు. యువజన, విద్యార్థి విభాగాలు ప్రతి విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించి, కేసీఆర్ చిత్రంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులు ధరిస్తే ఉద్యమ స్పూర్తి మరింత విస్తరించబడుతుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.కేటీఆర్ పిలుపుతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించాయి.

ఆనాటి దీక్షా దివస్‌: తెలంగాణ చరిత్రలో నిర్ణాయక ఘట్టం

తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన చారిత్రక నిరాహార దీక్షను బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నవంబర్‌ 29, 2009న ప్రారంభించారు. తెలంగాణ వచ్చేది లేదా తాను సచ్చుడోసచ్చుడో అనే సంకల్పంతో చేపట్టిన ఈ దీక్ష, కేవలం ఒక రాజకీయ పోరాటం కాకుండా కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆవేదనలకు ప్రతిబింబంగా మారింది. ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమం పూర్తిస్థాయి ప్రజా పోరాటంగా కొత్త దిశలో ముందుకు సాగింది.

నిరాహార దీక్ష ప్రారంభమైన వెంటనే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు విపరీతంగా స్పందించారు. విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. రోడ్లు, పట్టణాలు, గ్రామాలు 'జై తెలంగాణ' నినాదాలతో మార్మోగాయి. రోజురోజుకు కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. చివరికి ఆరో రోజులకే పరిస్థితి విషమించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామం తెలంగాణ డిమాండ్‌ను జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది.

దేశవ్యాప్తంగా రాజకీయ ఒత్తిడి పెరిగి, హైదరాబాదులో భారీ నిరసనలు జరిగాయి. పార్లమెంట్, అసెంబ్లీలలో తెలంగాణ అంశం ప్రధాన చర్చగా మారింది. ఆ సమయంలో తెలంగాణ ప్రజల్లో ఏర్పడిన ఐక్యత, భావోద్వేగం ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. విద్యార్థుల త్యాగాలు, అమరవీరుల స్ఫూర్తి ఉద్యమానికి మరింత బలం చేకూర్చాయి. చివరికి డిసెంబర్‌ 9, 2009న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. అదే ప్రకటన కోట్లాది తెలంగాణ ప్రజలకు ఉపశమనం, విజయోత్సాహాన్ని అందించింది.

ఆ రోజు జరిగిన నిరాహార దీక్ష, తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు మలుపు తిప్పిన సంఘటనగా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. ఆ త్యాగం, సంకల్పం, ప్రజా సమీకరణం తర్వాతే జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం వాస్తవ రూపం దాల్చింది.దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అందుకే నవంబర్‌ 29 ‘దీక్షా దివస్’గా తెలంగాణ భావజాలానికి ప్రతీకగా ప్రతి ఏడాది స్మరించబడుతోంది.

ఈ నెల 29న ‘దీక్షా దివస్’ ఘనంగా నిర్వహించాలి: కేటీఆర్ - Tholi Paluku