Let's talk: editor@tmv.in
ఈ నెల‌ 28 వరకు జీహెచ్‌ఎంసీ స్పెషల్ సానిటేషన్ డ్రైవ్

ఈ నెల‌ 28 వరకు జీహెచ్‌ఎంసీ స్పెషల్ సానిటేషన్ డ్రైవ్

Gaddamidi Naveen
4 ఫిబ్రవరి, 2026

భాగ్యనగరవాసులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) భారీ పారిశుధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు నగరంవ్యాప్తంగా 'ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్'ను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ డ్రైవ్ ద్వారా ప్రతిరోజూ 300 డివిజన్లలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టనున్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పేరుకుపోయిన పాత వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలు, నిర్మాణ రంగ వ్యర్థాలు, చెట్ల వ్యర్థాలు, ఇంజనీరింగ్ పనుల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగించడంపై దృష్టి సారిస్తారు. శుభ్రత పనులను దశలవారీగా ముఖ్యమైన ప్రజా ప్రదేశాల్లో చేపడతారు. అందులో ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల పక్కలు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, సరస్సులు, నాలాలు, అలాగే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ స్తంభాల పరిసర ప్రాంతాలు ఉన్నాయి.

గుర్తించిన పాత వ్యర్థాల ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పూర్తిగా శుభ్రం చేస్తాయి. సీ&డీ వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తారు. నగరంలో చెత్త పేరుకుపోయే అవకాశం ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లును గుర్తించి పూర్తిగా తొలగించనున్నారు.

పారిశుధ్య పనులతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు పౌరులు, పాఠశాలలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ-వేస్ట్ సేకరణ, ఆర్ఆర్ఆర్ కేంద్రాల ద్వారా పునర్వినియోగం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం, బహిరంగ మూత్ర విసర్జనపై స్పాట్ ఫైన్లు కూడా కఠినంగా అమలు చేయనున్నారు.