Let's talk: editor@tmv.in
ఈ నెల 26వ తేదీ కల్లా పంట నష్టంపై నివేదిక ఇవ్వండి: సీఎం చంద్రబాబు

ఈ నెల 26వ తేదీ కల్లా పంట నష్టంపై నివేదిక ఇవ్వండి: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
24 మార్చి, 2026

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించేందుకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ , గ్యాస్ సరఫరా, అకాల వర్షాల పంట నష్టంపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వంట గ్యాస్ కోసం సిలిండర్లపైనే ఆధారపడకుండా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి) విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి జిల్లాకు 10 వేల కొత్త కనెక్షన్లు

రాష్ట్రంలో పీఎన్జీ విస్తరణకు సంబంధించి అధికారులు వెల్లడించిన గణాంకాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 60 వేల మంది మాత్రమే వాడుతుండటంపై ఆయన ఆరా తీశారు. దీనిని 100 శాతం వినియోగంలోకి తీసుకురావాలని ప్రతి జిల్లాలో కనీసం 10 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆదేశించారు. నిలిచిపోయిన శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని, ఆంధ్రప్రదేశ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ భేటీ నాటికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

26లోగా పంట నష్టం నివేదిక

మరోవైపు గత ఐదు రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు భరోసా కల్పించేలా ఈ నెల 26వ తేదీ కల్లా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో జీఎస్డీపీ 40 శాతం పెరిగిన నేపథ్యంలో పంటల మార్పిడి ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించి దిగుబడి పెంచేలా చూడాలని పొరుగు రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగంపై అధ్యయనం చేయాలని సూచించారు.

సాంకేతికతతోనే పారదర్శక సేవలు

టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రభుత్వ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని సీఎం పేర్కొన్నారు. తిరుమలలో ఏఐ వినియోగం వల్ల క్యూలైన్ల నిర్వహణ మెరుగుపడింది ఇందుకు ఫలితంగా భక్తుల నిరీక్షణ సమయం తగ్గి అదనంగా 20 శాతం మందికి స్వామివారి దర్శన భాగ్యం లభిస్తోంది. ప్రసాదాల నాణ్యత విషయంలోనూ రాజీ లేకుండా అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం అని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. కాగా ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖలు ఏఐ ఇంటిగ్రేషన్‌పై దృష్టి సారించాలని ఐఓటీ, సెన్సార్లు, సీసీ టీవీ డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

కాగా ఈ సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.