
ఈ నెల 26న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయానికి వచ్చే కోట్లాది మంది భక్తుల ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంజూరు చేసిన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌ను ఈ నెల 26న అధికారికంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే హాల్ట్ స్టేషన్ ద్వారా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్టేషన్ ప్రారంభంతో దశాబ్దాలుగా భక్తులు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొమురవెల్లికి వచ్చే మల్లన్న భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే హాల్ట్ స్టేషన్‌ను మంజూరు చేసి, రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వేస్టేషన్‌కు 2024 ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొని శంకుస్థాపన చేశారు.
ప్రయాణీకుల సౌకర్యం కోసం హై-లెవల్ ప్లాట్‌ఫారమ్, విశాలమైన వెయిటింగ్ హాల్, ఆధునిక టికెటింగ్ కౌంటర్లు, పార్కింగ్, ప్రత్యేక మరుగుదొడ్ల వంటి అధునాతన సౌకర్యాలను ఈ స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచే ఈ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లి మీదుగా సిద్దిపేటకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు రైళ్లు నడుస్తాయి. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్యాసింజర్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపే అవకాశం ఉంది.
