Let's talk: editor@tmv.in
ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Gaddamidi Naveen
6 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

శాశ్వత చిహ్నంగా ఆలయ పునర్నిర్మాణం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడారం ఆలయ ప్రాంగణం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు శాశ్వత ప్రతీకగా నిలవబోతోందని తెలిపారు. గిరిజన సంప్రదాయాలను గౌరవించేలా విత్తనాలతో రూపొందించిన అందమైన గిరిజన శిల్పాలు ఆలయ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అన్నారు. దాదాపు 200 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా రాతి కట్టడాలతో ఆలయ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ఆచారాలు ప్రతిబింబించేలా విత్తన ఆధారిత శిల్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తున్నామన్నారు.

పరిశీలనలో భాగంగా మంత్రి ఆలయ ల్యాండ్‌స్కేపింగ్, ప్రధాన గోపుర ద్వారం నిర్మాణం, పీటీ బీమ్‌ల ఏర్పాటు, రాతి స్తంభాల బ్రాకెట్లు, క్యూలైన్ షెడ్లు, ఇతర సివిల్ పనులు, రోడ్ల అభివృద్ధి, సైడ్ బర్మ్స్, జంపన్న వాగు స్నాన ఘాట్లు, నీటి నిల్వ బండ్లు, భూమి లెవెలింగ్ పనులు, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ వంటి పనులను సమీక్షించారు.

మహిళా శక్తికి ఊతం

జంపన్న వాగు సమీపంలో ఇందిరా మహిళా శక్తి బాంబూ చికెన్ కాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. ఇది మహిళల ఆధ్వర్యంలో సాగుతున్న ఉపాధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. అన్ని సివిల్ పనులు, క్యూలైన్లు, షెడ్లు జనవరి 12లోగా పూర్తిచేయాలని, అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతికి ముందే మేడారం ప్రాంతం మొత్తం వెలుగులతో సర్వాంగ సుందరంగా ఉండాలని, జనవరి 31 వరకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

పారిశుధ్య పనులు జోన్, సెక్టార్ వారీగా నిర్వహిస్తూ నిర్లక్ష్యానికి ఎలాంటి అవకాశం లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. మేడారం జాతర ఈసారి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నిర్వహించబడుతోందని, లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ జాతర ఇప్పుడు కోట్లాది భక్తులతో మహోత్సవంగా మారిందని అన్నారు.

జనవరి 20న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మేడారం సందర్శించి, రాత్రి అక్కడే బస చేసి పూర్తైన ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ గిరిజనుల విశ్వాసం, వారసత్వాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించిందని మంత్రి పేర్కొంటూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన - Tholi Paluku