
ఈ నెల 20న సీఎం కప్–2026 ప్రారంభానికి సీఎంను ఆహ్వానించిన మంత్రి శ్రీహరి
తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సీఎం కప్-2026' ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ క్రీడా సంబరానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. మంగళవారం మంత్రి శ్రీహరితో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివాసేనా రెడ్డి, ఎండీ సోని బాలాదేవిలు ముఖ్యమంత్రిని కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విద్యార్థులు, యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ యువతను ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దారితీసే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సీఎం కప్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థుల వరకు అందరూ ఈ పోటీలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆయన కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వ భావన పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం కూడా మెరుగుపడతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం కప్ ద్వారా భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
