Let's talk: editor@tmv.in
ఈ నెల 20న ‘రైతు మహోత్సవం’

ఈ నెల 20న ‘రైతు మహోత్సవం’

Gaddamidi Naveen
19 మార్చి, 2026

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సచివాలయం ప్రాంగణం నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ 86వ ఎపిసోడ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంపికైన రైతులకు ప్రత్యేక ‘ఫార్మర్ కిట్స్’ను అందజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు, వాతావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, మన పూర్వీకులు అనుసరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లను గుర్తించి, ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది చొప్పున మొత్తం 61,125 మంది రైతులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రైతులకు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఫార్మర్ కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కిట్లలో “క్షేత్ర దర్శిని” పుస్తకం, క్లాత్ బ్యాగ్, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్, చిన్న డైరీ వంటి ఉపయోగకరమైన వస్తువులు ఉన్నాయి.

ఇక మార్చి 20, 21, 22 తేదీల్లో నర్మెట్ట మండలం, సిద్దిపేట జిల్లాలో నిర్వహించనున్న ‘రైతు మహోత్సవం’కు రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరి రోజు అయిన మార్చి 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు కె. సురేంద్రమోహన్, బి. గోపి తదితర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ నెల 20న ‘రైతు మహోత్సవం’ - Tholi Paluku