
ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపారమైన పశు సంపదకు నిలయమని రాష్ట్రంలోని పశువుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ శిబిరాలకు సంబంధించి కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పుంగనూరు వంటి గోజాతులు, శ్రేష్ఠమైన నెల్లూరు, మాచెర్ల గొర్రెల జాతులు మన రాష్ట్రంలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా పశుసంవర్ధక రంగం రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా నిలుస్తోందని, రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలు ఈ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని మంత్రి వివరించారు.
రాష్ట్ర పశుగణాంకాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఏపీలో 108.19 లక్షల ఆవులు, గేదెలు ఉన్నాయని గొర్రెలు, మేకల సంఖ్యలో (231.49 లక్షలు) అదేవిదంగా కోళ్ల సంఖ్యలో (1078.63 లక్షలు) ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025లో 13,257 గ్రామాలలో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 10.48 లక్షల పశువులకు వైద్య సేవలు అందించామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అన్ని గ్రామాల్లో ఈ శిబిరాలను నిర్వహించనున్నామని దీని ద్వారా పశువుల ఉత్పాదకత పెరగడమే కాకుండా వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ శిబిరాల ద్వారా పశుపోషకులకు అందే సేవలను మంత్రి వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలు, పశు వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు సంవత్సరానికి నాలుగు సార్లు, పెద్ద పశువులకు రెండు సార్లు నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి రైతులకు మేలైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
