
ఈ నెల 17న గవర్నర్‌కు ‘ఒక కోటి సంతకాల’ వినతిపత్రం: వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాష్ట్రవ్యాప్త ఉద్యమం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సేకరించిన ఒక కోటి సంతకాలతో కూడిన మహా వినతి పత్రాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 17న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు సమర్పించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంతకాల పత్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నట్లు, జగన్‌తో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్లు పార్టీ వెల్లడించింది.
ప్రైవేటీకరణపై జగన్ తీవ్ర వ్యతిరేకత
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) మోడల్‌లో 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న జగన్, ఈ నిర్ణయం వల్ల పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకపోవడంతో పాటు ప్రభుత్వ బోధన దవాఖానలు ప్రైవేట్ నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని, ప్రజా ఆరోగ్య సేవలు బలహీనపడతాయని హెచ్చరిస్తున్నారు. “ఆస్పత్రి అనేది దేవాలయం లాంటిది… దాన్ని లాభాపేక్ష రంగానికి అప్పగించడం అన్యాయం” అని ఇప్పటికే వ్యాఖ్యానించిన ఆయన, తన పాలనలో 2019–2024 మధ్య ఆమోదం పొందిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 7 పూర్తయ్యాయని, 5 ఇప్పటికే పనిచేస్తున్నాయని, మొత్తం 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరగడం ప్రభుత్వ బలమైన కట్టుబాటుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఇంత భారీ పెట్టుబడితో నిర్మించిన విద్యాసంస్థలను ప్రైవేట్ కి అప్పగించడం “ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేసుకోవడం” అని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.
ప్రజల నుంచి విశేష స్పందన
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో నిర్వహించిన సంతకాల సేకరణకు భారీ స్పందన లభించగా, గ్రామాలు, పట్టణాలు, వార్డు స్థాయిలో నేతలు ప్రజలను ప్రత్యక్షంగా కలవడంతో ఒక కోటి సంతకాలు సేకరించి, వాటిని ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడకు తరలించారు. నిపుణులూ ఈ ప్రైవేటీకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వైద్య విద్య ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందనీ, ప్రభుత్వ కోటా సీట్లు తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత పెరిగి, చివరికి ప్రజా ఆరోగ్య సేవలు ప్రైవేట్ ఆధారపడే పరిస్థితికి చేరవచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం కేవలం రాజకీయ వివాదం కాకుండా, రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య వ్యవస్థ, ప్రజల భవిష్యత్తుపై సుదీర్ఘ ప్రభావం చూపే కీలక అంశమవుతోంది పార్టీ నాయకులు పేర్కొన్నారు.
