Let's talk: editor@tmv.in
ఈ నెల 16న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ:

ఈ నెల 16న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ:

Panthagani Anusha
8 మార్చి, 2026

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం భావితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల ప్రతిమ) పేరుతో నిర్మిస్తున్న అమరజీవి స్మృతి వనం పనులను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.

అమరజీవి 125వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రి తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర కేబినెట్ సహచరులు హాజరవుతారని తెలిపారు. అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ స్మృతి వనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటు పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, నిర్వాహకులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.

ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోందని గుర్తుచేశారు. అదేవిధంగా అమ్మవారు జన్మించిన పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండ గా మారుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.