Let's talk: editor@tmv.in
ఈ నెలాఖరున కింగ్ చార్లెస్‌-III అమెరికా పర్యటన

ఈ నెలాఖరున కింగ్ చార్లెస్‌-III అమెరికా పర్యటన

Shaik Mohammad Shaffee
1 ఏప్రిల్, 2026

బ్రిటన్ రాజు చార్లెస్‌-III ఈ నెల చివరలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా స్వాతంత్య్రం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ మైత్రీ సంబంధాలను చాటిచెప్పేందుకు ఈ పర్యటన ఖరారైంది. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చార్లెస్‌ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఆయన వ్యక్తిగతంగా 19 సార్లు అమెరికాను సందర్శించినప్పటికీ, రాజ్యాధినేత హోదాలో 'స్టేట్ విజిట్' చేయడం ఇదే ప్రథమం. ఆయన తల్లి, దివంగత రాణి ఎలిజబెత్-II తన హయాంలో నాలుగుసార్లు అమెరికాలో అధికారిక పర్యటనలు చేశారు.

దౌత్య బంధం బలోపేతమే లక్ష్యం

గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ సందర్శించిన సమయంలో రాజకుటుంబం ఆయనకు అత్యంత వైభవంగా ఆతిథ్యం ఇచ్చింది. బ్రిటన్ రాజకుటుంబం అంటే ట్రంప్‌నకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్‌తో ఆయనకు సత్సంబంధాలు లేవనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం విషయంలో బ్రిటన్ ప్రధాని కేవలం నామమాత్రపు మద్దతునే ప్రకటించడంపై ట్రంప్ అసహనంతో ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజు చార్లెస్‌ పర్యటన.. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన బంధాన్ని పటిష్టం చేసేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తొలిసారి బర్ముడాకు..

అమెరికా పర్యటనతో పాటు, కింగ్ ఛార్లెస్ బ్రిటన్ ఓవర్సీస్ భూభాగమైన బర్ముడాను కూడా సందర్శించనున్నారు. రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆ ప్రాంతానికి వెళ్లడం ఇదే మొదటిసారి. అగ్రరాజ్యం స్వాతంత్య్ర వేడుకల వేళ, బ్రిటన్ రాజు రాక అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.