Let's talk: editor@tmv.in
ఈ దాడి రాజ్యాంగం మీదే

ఈ దాడి రాజ్యాంగం మీదే

FL - BHAVN
9 అక్టోబర్, 2025

అక్టోబర్ 6 వ తేదిన సుప్రీం కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో రాకేశ్ కిశోర్ అనే ఒక సీనియర్ న్యాయవాది ఛీఫ్ జస్టీస్ బి. ఆర్. గవాయ్ మీదకు బూటు విసిరి దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రమైన కలకలం రేపింది. కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో నిండు కోర్టులో జరగడం అనేది అనూహ్యమే కానీ ఇది న్యాయవ్వవస్థ గౌరవం, భద్రతాలోపాల వంటి విషయాలను ప్రశ్నార్థకం చేసింది.

దాడికి జరిగిన ప్రయత్నాన్ని అక్కడి భద్రతా సిబ్బంది ఇతర న్యాయవాదులు వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు న్యాయమూర్తిని తాకకుండా ఆపగలిగారు. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన న్యాయవాది రాకేశ్ కిశోర్ తన చర్యలను సమర్థించుకుంటూ సీజేఐ సతానతన ధర్మాన్ని అవమానించారు అందువల్ల దేవుని ఆజ్ఞ గా తాను ఈ పని చేశానని తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని కూడా అని అన్నారు. ఇది అన్నింటికంటే ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం.

అసలెందుకీ దాడి?

అక్టోబర్ 6 న సీజేఐ మీద దాడి జరిగేందుకు కొన్ని రోజుల ముందు సుప్రీం కోర్టు విచారణకు వచ్చిన ఖజురహో విష్ణు విగ్రహ పునరుద్ధరణకు సంబంధించిన కేసులో సీజఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడికి కారణంగా చూపుతున్నారు.

రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఖజురహో జవారి ఆలయ సముదాయంలో ఉన్న ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహం మొఘల్ దండయాత్రలో ధ్వంసమైందని తన పిటీషన్ లో ప్రస్థావించారు. కనుక ఈ విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త విగ్రహ ప్రతిష్ఠాపన కానీ లేదా పాత విగ్రహా పునరుద్ధరణ కానీ జరిగేలా కేంద్రప్రభుత్వాన్ని, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ను ఆదేశించాలని కోరారు. ఈ పిటీషన్ గురించి బీఆర్ గవాయ్ తోపాటు అగస్టీన్ జార్జ్ మసీహ్ పాల్గొన్న ధర్మాసనం విచారణ జరిపింది. పురావస్తు చట్టాలను అనుసరించి కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం కుదరదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంధర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని లేపాయి. ‘‘ఇది పురావస్తు ప్రదేశం కనుక కోర్టు నిస్సహాయమైందని, అపార భక్తులు కనుక ఆ దేవుడే ఏదైనా చెయ్యగలరేమో అడగండి, మేము జోక్యం చేసుకోలేము.’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్షలు మిన్నంటాయి. ఆ విమర్షలకు సీజేఐ జస్టీస్ గవాయ్ స్పందిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తనకు సనాతన ధర్మాన్ని అవమానపరిచే ఉద్దేశ్యం లేదని స్పష్టమైన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సీజేఐ ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించినట్టుగా ఉన్నాయని దాడి చేసిన రాకేశ్ కిషోర్ భావించారు. ఆయన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని అందుకే తాను ఈ చర్యకు పాల్పడ్డానని మీడియాకు తెలిపారు.

ఇది వ్యవస్థ మీద దాడి

జరిగిన సంఘటన కేవలం వ్యక్తి మీద చేసిన దాడి ప్రయత్నం కాదు. భారత న్యాయవ్యవస్థ గౌరవానికి జరిగిన భంగపాటు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి పై ఇలాంటి చర్య న్యాయస్థాన పవిత్రతను ప్రశ్నించటమే అవుతుంది. న్యాయవాదులు కోర్టు హాల్లో పాటించాల్సిన మర్యాదలు, ప్రవర్తనా నియమావళిని ఈ చర్య పూర్తిగా ఉల్లంఘించినట్టుగానే ఈ న్యాయవాది ప్రవర్తనను పరిగణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ దాడిచేసిన న్యాయవాది తన చర్యకు మతపరమైన రాజకీయ కారణాలను ఆపాధిస్తూ సమర్థించుకోవడం న్యాయవ్యవస్థలోకి ఉద్రేకపూరిత భావజాలం చొరబడుతోందనేందుకు సంకేతంగా కనిపిస్తోంది. త

మకు వ్యతిరేకంగా వచ్చే తీర్పులు లేదా వ్యాఖ్యల మీద అసంతృప్తిని వ్యక్త పరిచేందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

న్యాయవ్యవస్థ పవిత్ర, స్వతంత్ర్య ప్రతిపత్తి

న్యాయమూర్తులు ఎలాంటి భయాలు లేకుండా నిష్పాక్షికంగా తీర్పులు చెప్పగలిగే స్వతంత్ర్యాన్ని ఈ దాడి ప్రశ్నిస్తోందని చెప్పాలి. ఒక అత్యున్నత న్యాయమూర్తి మీద దాడికి యత్నించడం రూల్ ఆఫ్ లా అస్థిత్వాన్ని బలహీనపరుస్తోంది. ఈ సంఘటన న్యాయవ్యవస్థ మీద సాధారణ ప్రజల్లో గౌరవాన్ని పలుచన చేసే ప్రమాదం ఉంది. ఇది భారత న్యాయ చరిత్రలో చీకటిరోజుగా నిలిచిపోయిందని అనాలి.

తన చర్యను సమర్థించుకుంటూ దాడిచేసిన వ్యక్తి సనాతన ధర్మాన్ని కించపరచడం వంటి మతపరమైన కారణాలు ఆపాధిస్తున్నారు. ఇది వ్యక్తిగత లేదా సైద్ధాంతిక అసంతృప్తిని ప్రధాన న్యాయ మూర్తి మీద అది కూడా నిండు కోర్టు హాల్ లో హ్యేయమైన దాడి ద్వారా వ్యక్తం చెయ్యడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రమూ ఆమోదయోగ్యమైన విషయం కాదు. న్యాయ పరిరక్షణలో ముందుండాల్సిన న్యాయ వాది తన కోపాన్ని అసంతృప్తిని అదుపు చేసుకోలేక చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం న్యాయవాద వృత్తి ప్రతిష్టను దెబ్బతియ్యడమే అవుతుంది.

భద్రతా లోపాలు

సీజేఐ మీద జరిగిన దాడి ప్రయత్నం వెనకున్న నైతిక, సైద్దాంతిక రాద్ధాంతాలను కాసేపు పక్కన పెడితే భారత అత్యున్నత న్యాయస్థానంలోని కోర్టు హాల్ లో ప్రధాన న్యాయమూర్తి భద్రతకు ముప్పు వాటిల్లిందంటే అక్కడున్న భద్రతా లోపాలు సుస్పష్టం అవుతున్నాయి. ఇది కోర్టు గదిలోని భద్రతా సిబ్బంది అప్రమత్తతను ప్రశ్నిస్తోంది.

తనపై దాడకి యత్నం జరగినప్పటికీ జస్టీస్ గవాయ్ తన సంయమనాన్ని ఎంత మాత్రమూ కోల్పోకుండా నిబ్బరంగా వ్యవహిరంచడం న్యాయవ్యవస్థ ఎంత ధైర్యం కలిగి నడచుకుంటుందో, న్యాయపరిరక్షణలో ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తుందో చాటిచెప్పిందనే అనాలి. ఆ సందర్భంలో ఇలాంటి బెదిరింపులు తనను ఏ విధంగానూ ప్రభావితం చెయ్యవనే ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి న్యాయవ్యవస్థ నిర్భీతికి నిదర్శం.

ప్రధానితో సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులు సీజేఐ కి మద్దతుగా ప్రకటనలు చేశారు. ఇది ప్రజాస్వామ్యం పై దాడికి ప్రయత్నించడమే అని న్యాయవ్యవస్థకు సంఘీభావం ప్రకటించారు. బార్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా సదరు రాకేష్ కిశోర్ లైసెన్స్ రద్దు చేసింది. ఫలితంగా అతడు ఇక దేశంలోని ఏ కోర్టులోనూ తన వృత్తిని కొనసాగించలేరు. అయితే దాడికి ప్రయత్నించిన వ్యక్తి మీద క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం వెనుక సీజేఐ సూచనలు ఉన్నప్పటికీ ఈ చర్య భవిష్యత్తులో మరికొంతమంది దుస్సాహాసాలకు ఒడిగట్టేందుకు ప్రొత్సాహం ఇచ్చేది కాకూడదు. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన నొక్కి చెబుతోంది. ఈ చర్య రాజ్యాంగంలోని నిర్దుష్టంగా ఆర్టికల్‌ను నేరుగా ఉల్లంఘించకపోయినా, రాజ్యాంగపు మూల స్ఫూర్తి మరియు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా దీనిని పరిగణించాలి.

ఈ దాడి రాజ్యాంగం మీదే - Tholi Paluku