Let's talk: editor@tmv.in
ఈ ఏడాది నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం

ఈ ఏడాది నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరం వెలుపల 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో తరగతి గదులు, క్రీడా మైదానాలు, రవాణా సౌకర్యం, సమగ్ర బోధనా సిబ్బంది వంటి అన్ని వసతులతో ఈ స్కూళ్లు ఉండాలని స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం నాణ్యమైన విద్యకు చిరునామాగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంలో ఎంత వ్యయమైనా వెనుకాడం అని ప్రకటించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సాంకేతికతతో పాఠశాలలు నిర్మించాలని, ఏడాదిలోగా 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌ల తరహా వసతులు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలని పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో అప్‌గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

విద్యలో సంస్కరణలు – ఏఐ నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు

కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో పాఠశాల స్థాయి నుంచే ఏఐ బోధన ప్రారంభించాలని, ఉపాధ్యాయులకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి పాలు అందించాలని నిర్ణయించారు. పాలను విజయా డెయిరీ నుంచి సేకరించనున్నారు. విద్యార్థులకు అందే క్యాలరీలపై సాంకేతిక పర్యవేక్షణ కూడా ఉండాలని సూచించారు. ఈ ఏడాది నుంచే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలతో పాటు పూర్తి కిట్ అందించనున్నారు. స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, డిక్షనరీ, బూట్లు, సాక్సులు వంటి సామగ్రి అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు.

పాలిటెక్నిక్‌ల్లో ఏఐ కోర్సులు

పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలని, కాలం చెల్లిన కోర్సులను తొలగించాలని సీఎం ఆదేశించారు. కోర్సులు పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపుపై నివేదిక సమర్పించాలని ఆదేశించిన సీఎం, ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై నియంత్రణ

ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు, డీఈవోల నేతృత్వంలో సమీక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో తుది కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, మేధావుల అభిప్రాయాల కోసం ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని సూచించారు.

ఉన్నతాధికారులకు హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ క్లాసులు

రాష్ట్ర ఉన్నతాధికారులకు హర్వర్డ్ యూనివర్సిటీ నిపుణులతో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు హార్వర్డ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందన్నారు. గ్రూప్–I (271 మంది), గ్రూప్–II (175 మంది) అధికారులు ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించి, అధికారులను అభినందించారు.

ఎస్.ఆర్. శంకరన్‌ను గుర్తుపెట్టుకోండి

విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని, పేదలకు సహాయం చేసే సమయంలో ఎస్.ఆర్. శంకరన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చట్టాలు పని ఆపేందుకు కాదు, పది మందికి సహాయం చేసేందుకు. మీరే ప్రభుత్వానికి కళ్లు, చెవులు అని అన్నారు. గ్రూప్-1 పరీక్షలను దీర్ఘ విరామం తర్వాత పారదర్శకంగా నిర్వహించామని, న్యాయస్థానాల్లో పోరాడి అభ్యర్థుల కలలను సాకారం చేశామని తెలిపారు. 30-35 ఏళ్ల సేవలో నిబద్ధతే గుర్తింపునిస్తుందని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని సేవ చేయాలని సూచించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో నుంచి కోత విధించి వారి ఖాతాల్లో జమ చేసేలా చట్టం తీసుకురానున్నట్టు సీఎం హెచ్చరించారు. జీవితంలో సెటిల్ కావాలని రకరకాల ఆలోచనలతో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. గరం, నరం, బేషరం.. అన్న నానుడిని తప్పు అని రుజువుచేస్తూ పదవీ విరమణ చేసే సమయానికి కూడా గరంగానే ఉండాలని నా ఉద్దేశం. నిబద్ధతతో పనిచేయండని పిలుపునిచ్చారు.