Let's talk: editor@tmv.in
ఈ ఎన్నికల్లో ‘సూపర్‌స్టార్’ డీఎంకే మేనిఫెస్టోనే: సీఎం స్టాలిన్

ఈ ఎన్నికల్లో ‘సూపర్‌స్టార్’ డీఎంకే మేనిఫెస్టోనే: సీఎం స్టాలిన్

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టోనే అసలైన ‘సూపర్‌స్టార్’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ పేర్కొన్నారు. ఎవరికైనా హామీలు ఇవ్వడం సాధ్యమే కానీ ప్రజలు విశ్వసించేది డీఎంకే ఇచ్చే హామీలనే అని ఆయన అన్నారు. విరుదునగర్‌లో జరిగిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ భారీ ప్రజాసభలో మాట్లాడిన ఆయన, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, మహిళల నుంచి యువత వరకు ప్రతి వర్గానికీ డీఎంకే మేనిఫెస్టో నచ్చుతుందని చెప్పారు. 2026 ఎన్నికల రంగంలో మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్‌గా పరిచయం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

హామీ విలువ దాన్ని ఎవరు ఇస్తున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుందని స్టాలిన్ చెప్పారు. ఎవరు కావాలంటే వారు హామీలు ఇవ్వొచ్చు. కానీ ప్రజలు నమ్మేది డీఎంకే ఇచ్చే హామీలనే. ఇతరులు చెప్పేవాటికి విలువ ఉండదని వ్యాఖ్యానించారు.

డీఎంకే మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఇల్లతరసి’ పథకం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు రూ.8,000 విలువైన కూపన్ అందిస్తామని చెప్పారు. ఈ కూపన్‌తో వారు తమకు నచ్చిన దుకాణంలో వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ పథకం కుటుంబ బాధ్యతలు నిర్వహించే మహిళల పనిభారాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇక మహిళలకు అందిస్తున్న మహళిర్ ఉరిమై తొగై నెలసరి ఆర్థిక సహాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

పళనిస్వామి దిగజారి మాట్లాడుతున్నారు

ఇదే సమయంలో ప్రతిపక్షాలపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలు తమిళనాడు టీమ్, ఢిల్లీ టీమ్ మధ్య జరిగే పోరుగా ఆయన అభివర్ణించారు. ఎడప్పాడి కే.పళనిస్వామి తన ఎన్నికల ప్రచారాన్ని అసత్యాలు, తక్కువ స్థాయి వ్యాఖ్యలపై ఆధారపడ్డారని ఆరోపించారు. ద్రోహానికి రూపం ఇస్తే అది పళనిస్వామి అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను డీఎంకే మోసం చేసిందన్న పళనిస్వామి ఆరోపణలను స్టాలిన్ ఖండించారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలు ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో తనను కలిసి కృతజ్ఞతలు తెలిపి మిఠాయిలు తినిపించారని ఆయన గుర్తు చేశారు. డీఎంకే సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నందుకే ప్రతిపక్షాలు నిరాశతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లక్ష్యం తమిళనాడు అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆరోపించారు. విరుదునగర్, శివకాశి, అరుప్పుకోట్టై నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ద్రావిడియన్ మోడల్ పాలనను కొనసాగిస్తూ ద్రావిడియన్ మోడల్ 2.0లో తమ ప్రభుత్వం గత రికార్డులను తామే బద్దలు కొడతామని స్టాలిన్ అన్నారు.

ఈ ఎన్నికల్లో ‘సూపర్‌స్టార్’ డీఎంకే మేనిఫెస్టోనే: సీఎం స్టాలిన్ - Tholi Paluku