
ఈ ఎన్నికల్లో జన్‌సురాజ్, ఎన్డీయే మధ్యే పోటీ: ప్రశాంత్ కిశోర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ జన్ సురాజ్,ఎన్డీయే మధ్యనే ఉంటుందని, మహాఘట్బంధన్ మూడో స్థానంలోకి వెలుతుందని జన సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.మేం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. మహాఘట్బంధన్ మూడో స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ జన్ సురాజ్,ఎన్డీయే మధ్యనే ఉంది. గత 5 రోజులుగా తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనలకు ఏమాత్రం అర్థం లేదు. వారు ఇవన్నీ ఎన్నికల రేసులో నిలవడానికే చెబుతున్నారు. ప్రజలెవరూ వారు చెబుతున్న మాటలు వినడం లేదు. ఇస్తున్న హామీలను పట్టించుకోవడం లేదన్నారు. మధుబనిలో జరిగిన సభలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు భయపెట్టే రాజకీయాలనుంచి బయటపడాలని చూస్తున్నారని తెలిపారు. మోడీ సస్తా డేటా ఇస్తామంటున్నారు. కానీ మాకు బీహార్ బిడ్డ కావాలి. మాకు డేటా వద్దు. ప్రజలకు అంతకంటే ముందు ఉపాధి కావాలన్నారు. ఈ సారి ఛత్, దీపావళి కుటుంబంతో కలిసి చేసుకోవాలనుకుంటున్నామని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
మరి విలన్ ఎవరు?
తేజస్వీ యాదవ్‌ను బీహార్ హీరోగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలపై ఆయన స్పందిస్తూ బీహార్‌ను నాశనం చేసిన వారిని హీరోలుగా పిలిస్తే మరి విలన్ ఎవరు? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని ఇటువంటి పరిస్థితులకు తెచ్చిందెవరో ప్రజలకు బాగా తెలుసన్నారు.30 సంవత్సరాలుగా ప్రజలు లాలూ ప్రసాద్ యాదవ్ కు భయపడి నితీశ్ కుమార్ కి-బీజేపీకి ఓటేశారు. బీజేపీకి భయపడి లాలూకు ఓటేశారు. ఈ భయపడే పరిస్థితులు క్రమంగా తొలగిపోతున్నాయి. నాయకుల కోసం, కులాల కోసం కాకుండా ప్రజలకోసం, బీహార్ యువతకు చెందిన ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం వస్తోంది అని ఆయన అన్నారు.జన సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే బిహార్ యువత ఉద్యోగాల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన హామీ ఇచ్చారు.
ప్రతి హామీని నెరవేరుస్తా; తేజస్వీ యాదవ్
తేజస్వి యాదవ్ ఆదివారం ప్రచార ర్యాలీలో ఓటర్లకు తమ కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లను విమర్శించడం తప్ప ఎన్డీయే ప్రభుత్వం ఏమి చేయడం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.రెండు కోట్ల ఉద్యోగాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఏమయ్యాయి? మేం పని చేయడాన్ని నమ్ముతాం. రాబోయే 5 సంవత్సరాలలో మేం ఏం చేస్తామో, ప్రజలకు ప్రతిదీ చెబుతున్నాం అని ఆయన గతంలో ఎన్డీయే ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాఘట్బంధన్ గతంలోనే ప్రకటించింది, అలాగే వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి చెందిన ముఖేష్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి.
