Let's talk: editor@tmv.in
ఈస్ట్ సెంట్రల్‌ రైల్వేలో 1,149 అప్రెంటిస్ ఖాళీలు

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వేలో 1,149 అప్రెంటిస్ ఖాళీలు

Shaik Mohammad Shaffee
29 సెప్టెంబర్, 2025

రైల్వేలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వివిధ ట్రేడ్‌లలో 1,149 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామకాలకు రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు

దానాపూర్ డివిజన్: 675 పోస్టులు, ధన్‌బాద్ డివిజన్: 156 పోస్టులు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్: 62 పోస్టులు, సోన్‌పూర్ డివిజన్: 47 పోస్టులు, సమస్తిపూర్ డివిజన్: 42 పోస్టులు, గ్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్/హర్నౌట్: 110 పోస్టులు, ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ: 29 పోస్టులు, మెకానికల్ వర్క్‌షాప్/సమస్తిపూర్: 28 పోస్టులు.

ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డిజిల్‌), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, టర్నర్‌, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్ తదితరాలు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీచేసిన నేషనల్‌ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 25 అక్టోబర్ 2025 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ఈ అప్రెంటిస్ పోస్టుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో సాధించిన మార్కులు, ఐటీఐ పరీక్షలో సాధించిన మార్కులకు సమాన వెయిటేజీ ఇస్తారు. ఈ రెండు మార్కుల శాతాల సరాసరి ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలన కోసం పిలుస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ecr.indianrailways.gov.inను సందర్శించండి.

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వేలో 1,149 అప్రెంటిస్ ఖాళీలు - Tholi Paluku