Let's talk: editor@tmv.in
ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ..పోర్టుల అభివృద్ధికి సీఎం దిశానిర్దేశం

ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ..పోర్టుల అభివృద్ధికి సీఎం దిశానిర్దేశం

Panthagani Anusha
18 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత కీలకమైన ‘ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌’గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ ప్రగతిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఓడరేవులను అంతర్జాతీయ ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శరవేగంగా పనులు జరుపుకుంటున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో త్వరితగతిన కార్గో ఆపరేషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటైన తర్వాత ఇది భారీ కంటైనర్ బల్క్ కార్గో హబ్‌గా అవతరిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గానికి రైల్వే శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని, ఇది పారిశ్రామిక రవాణాకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆయన వెల్లడించారు.

పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల (హింటర్ ల్యాండ్) నుంచి కార్గో రవాణా ఏపీ పోర్టుల ద్వారానే జరిగేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల ఏపీ ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు. పోర్టుల సమీపంలో ఆధునిక హంగులతో పోర్టు టౌన్ షిప్ లు, భారీ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత తూర్పు తీరంలోని పోర్టులే సురక్షితమనే అభిప్రాయం అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఈ అనుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలని, ఏపీ పోర్టులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అలాగే, రెండో దశలో భాగంగా బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.