
ఈసీ రాజీపడుతోంది
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీహార్‌లో ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కానీ ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థలా పనిచేస్తున్నదంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయిందని చెప్పారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
గెలుపుపై విశ్వాసంతో విన్నాం
బీహార్‌లో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని, ప్రజలు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం విశ్వసనీయత మీదే తమకు అనుమానం ఉందన్నారు. "న్యాయమైన ఎన్నికలు జరిగితే, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉంటే, బీహార్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి చాలా నమ్మకంగా ఉంది" పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రజల కోసం ఏమీ చేయని ఎన్డీయే సర్కారు ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాలను ఎందుకు ప్రారంభించిందని ప్రశ్నించారు. కేవలం ఓటమి భయంతోనే ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో రకరకాల పథకాలను ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. "రెండు రోజుల క్రితం, ప్రధానమంత్రి బీహార్ యువత కోసం ఒక పథకాన్ని ప్రకటించారు. 20 సంవత్సరాలుగా వారు బీహార్ యువత, నిరుద్యోగుల కోసం ఏమీ చేయలేదు. ఇప్పుడే ప్రధానికి యువకులు గుర్తుకువచ్చారా?’ అంటూ ఠాగూర్ ప్రశ్నించారు.
మహిళలకు డబ్బులివ్వడం కూడా జిమ్మిక్కే
అక్టోబర్ 2న, మహిళలకు రూ. 10 వేలు ప్రకటించడం కూడా జిమ్మిక్కేనని ఠాగూర్ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిస్పక్షపాతంగా ఉండాలని కోరారు. ఎస్ఐఆర్ విషయంలోనూ ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్‌లో రాజకీయ వేడి రాజుకున్నది. ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఏ గెలుస్తుందో వేచి చూడాలి.
