Let's talk: editor@tmv.in
ఈసీ బీజేపీ జెండా ఎగరేయాల్సిందే: అఖిలేశ్‌ యాదవ్‌

ఈసీ బీజేపీ జెండా ఎగరేయాల్సిందే: అఖిలేశ్‌ యాదవ్‌

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఫామ్‌–7ను దుర్వినియోగం చేస్తూ సమాజ్‌వాది పార్టీ ఓటు షేర్‌ను మార్చే ప్రయత్నం చేస్తోందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ-ఎన్నికల కమిషన్‌ మధ్య ‘కూటమి’ ఉందని విమర్శిస్తూ ఇక ఆలస్యం ఎందుకు? ఈసీ నేరుగా బీజేపీ జెండానే ఎగరేయాలని వ్యాఖ్యానించారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ, ఫామ్‌-7పై తాము లేవనెత్తిన ప్రశ్నల అనంతరం ప్రభుత్వం ఢిల్లీ, లక్నో సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఏజెన్సీలు, నిపుణులను రంగంలోకి దింపిందని అఖిలేశ్‌ ఆరోపించారు. వీరి వద్ద పూర్తి ఓటరు జాబితా ఉందని, ఎస్పీ గెలిచిన పోలింగ్‌ బూత్‌లను గుర్తించి అక్కడే ఫామ్‌-7లను నింపి ముద్రిస్తున్నారని చెప్పారు. దీని వల్ల అనేక ప్రాంతాల్లో అవాంతరాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్ఐఆర్‌) ద్వారా బీజేపీ ఇప్పటికే ఎన్నికలు గెలిచింది. ఇప్పుడు అదే విధానాన్ని పశ్చిమ బెంగాల్‌లోనూ అమలు చేయాలని చూస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్‌ బీజేపీ కమిషన్‌గా మారిందని పదే పదే చెబుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్ఐఆర్‌)లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసే గడువును ఎన్నికల కమిషన్‌ మార్చి 3, 2026 వరకు పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 5న జారీ చేసిన లేఖ ప్రకారం, జనవరి 6, 2026న ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం మొదట ఫిబ్రవరి 6తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు, ఓటరు నమోదు నిబంధనలు–1960లోని రూల్‌–12 ప్రకారం గడువును పొడిగించినట్లు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ పొడిగింపు ద్వారా పౌరులు తమ ఓటరు నమోదు వివరాలను ధృవీకరించుకోవడానికి, అభ్యంతరాలు తెలపడానికి, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చేందుకు తగిన అవకాశం లభిస్తుందని ఈసీ పేర్కొంది.

ఫామ్‌–7 కుట్ర బట్టబయలు

‘నంద్‌లాల్‌’ను ప్రజల ముందుకు తీసుకొచ్చిన అఖిలేశ్‌

బీజేపీ ప్రతిపక్ష పార్టీల ఓట్లను, ముఖ్యంగా పీడీఏ(వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాకులు) లోని మైనారిటీల ఓట్లను కట్‌ చేయడానికి ఫామ్‌–7ను దుర్వినియోగం చేస్తోందని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. ఈ మేరకు లక్నోలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ‘నంద్‌లాల్‌’ను ప్రజల ముందుకు తీసుకొచ్చి, బీజేపీ చేసిన కుట్రను బట్టబయలు చేసినట్లు ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.

నంద్‌లాల్‌ కు సంతకం చేయడం రాదని, వేలిముద్ర మాత్రమే వేస్తాడని, అయినా అతని పేరుతో సంతకాలు చూపిస్తూ ఫామ్‌–7కు సంబంధించిన వందలాది నకిలీ పత్రాలు తయారు చేసినట్లు అఖిలేశ్‌ ఆరోపించారు. ఇది దేశం, ప్రజలను బహిరంగంగా మోసం చేయడమేనని విమర్శించారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిందని, సమాజంలో ఆ పార్టీపై నమ్మకం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్న పీడీఏ ప్రహరీలు, మాజీ ఎమ్మెల్యే అరుణ్‌ వర్మ సహా కార్యకర్తల పాత్ర ప్రశంసనీయమని, ఈ విషయంలో నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అభినందనలు తెలిపారు.