
ఈసీ ‘దురుద్దేశం’ప్రజాస్వామ్యానికే ముప్పు:కాంగ్రెస్
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపర్చేందుకు ఎన్నికల సంఘం ‘దురుద్దేశపూర్వకంగా’ వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పై విరుచుకుపడింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్ఐఆర్) పేరుతో చేపట్టిన ప్రక్రియ అసలు లక్ష్యం ‘టార్గెట్‌డ్ ఓటు డిలీషన్’ అని ఆరోపిస్తూ, డిసెంబర్ తొలి వారంలో రాంలీలా మైదానంలో లక్షలాది మంది ప్రజలతో భారీ నిరసన సభను నిర్వహిస్తామని ప్రకటించింది. ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసీ మోటివ్ స్పష్టంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను దెబ్బతీయడమే. ఇంతకు ముందు ఎన్నడూ జరగని పరిస్థితి ఇది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్–నికోబార్, లక్షద్వీప్ నుంచి కూడా నాయకులు పాల్గోన్నారు.
బీజేపీ నీడలో ఈసీ పనిచేస్తోంది
సమీక్ష తర్వాత ఖర్గే సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యల్లో ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం తగ్గుతున్న ఈ సమయంలో ఈసీ ప్రవర్తన మరింత నిరుత్సాహపరుస్తోంది. తమ రాజ్యాంగ ప్రమాణం గుర్తుంచుకుని బీజేపీ నీడలో కాకుండా స్వతంత్రంగా పని చేస్తున్నామనే విషయం నిరూపించాలి అని మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియను బీజేపీ ఓట్ చోరీ ఆయుధంగా మార్చుకుంటోంది. ఈసీ చూస్తూ ఉంటే అది పరిపాలన వైఫల్యం కాదు పరోక్షంగా సహకరించడం (కంప్లిసిటీ)అవుతుంది అని తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఎల్ఓలపై ఒత్తిళ్లు
ఎస్ఐఆర్ ఒక నెలలో పూర్తిచేయాలని ఈసీ ఒత్తిడి పెట్టడం వల్ల గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, కొన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు కూడా ఇది కారణమవుతోందని వేణుగోపాల్ ఆరోపించారు. కేరళలో మొదటి దశ లోకల్ బాడీ ఎన్నికలున్న రోజైన డిసెంబర్ 9న ఫైనల్ జాబితా ఇవ్వాలని బీఎల్ఓలను బలవంతం చేస్తున్నారని విమర్శించారు.కేరళ అసెంబ్లీ, అన్ని రాజకీయ పార్టీలు (బీజేపీ తప్ప) ఎస్ఐఆర్ వాయిదా వేయాలని కోరినా ఈసీ లెక్కచేయలేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రాజ్యాంగ విలువలకు ముప్పు’
ఎన్నికల జాబితా శుద్ధి అవసరమే. కానీ ఇది నిబద్ధతతో జరగాలి. బీజేపీ కోసం ఓట్ల డిలీషన్ చేయడమే ఇప్పటి ప్రక్రియ లక్ష్యం అని వేణుగోపాల్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యూహం ప్రకారం డిసెంబర్ తొలి వారం రాంలీలా మైదానంలో భారీ గర్జన చేపట్టి, ఈసీపై ప్రజా ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రముఖ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ ఎస్ఐఆర్ అసలు లక్ష్యం కొత్త ఓట్లు చేర్చడం కాదు. పాత చట్టబద్ధ ఓట్లు తొలగించడం. దీని వెనుక ఉన్న దురుద్దేశాన్ని దేశానికి చూపిస్తామని ప్రకటించారు.
