Let's talk: editor@tmv.in
ఈసీ–టీఎంసీ మధ్య ‘గెట్ లాస్ట్’ దుమారం

ఈసీ–టీఎంసీ మధ్య ‘గెట్ లాస్ట్’ దుమారం

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీ), ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రతినిధి బృందం మధ్య బుధవారం జరిగిన సమావేశం ఉద్రిక్తంగా ముగిసింది. సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌ తమకు ‘గెట్ లాస్ట్’అని చెప్పారని టీఎంసీ నేతలు ఆరోపించగా, సమావేశంలో టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ గట్టిగా మాట్లాడారని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. టీఎంసీ ప్రతినిధి బృందంలో రాజ్యసభలో పార్టీ నాయకుడు డెరిక్ ఓబ్రియన్, ఉపనేత సాగరిక ఘోష్‌ , ఎంపీలు సాకేత్‌ గోఖలే, మేనకా గురుస్వామి ఉన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌‌) తర్వాత పెద్దఎత్తున ఓటర్లు జాబితా నుంచి తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో వారు ఈసీని కలిశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఓబ్రియన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి రాసిన తొమ్మిది లేఖలను ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు అందజేశామని చెప్పారు. అయితే ఆ లేఖలకు ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు.

ఎన్నికల అధికారులకు బీజేపీతో సంబంధాలు

బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియలో ఉన్న కొంతమంది అధికారులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని వారు ఆరు ఉదాహరణలు ఇచ్చామని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ప్రధాన ఎన్నికల అధికారి ఒక బీజేపీ నేతతో కలిసి కనిపించిన ఘటనను కూడా ఉదాహరణగా చూపామని చెప్పారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అని మేము ప్రశ్నించగా, సీఈసీ ‘గెట్ లాస్ట్’ అని అన్నారని ఓబ్రియన్ ఆరోపించారు. ఈ సమావేశం కేవలం ఏడు నిమిషాలే కొనసాగిందని ఆయన తెలిపారు.

డెరిక్‌ ఓబ్రియన్‌ గట్టిగా అరిచారు

ఇక ఎన్నికల సంఘం వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. సమావేశంలో డెరిక్ ఓబ్రియన్ గట్టిగా మాట్లాడారని, కమిషన్ సమావేశంలో అలాంటి ప్రవర్తన సరైంది కాదని సీఈసీ సూచించారని పేర్కొన్నారు. సమావేశంలో శాంతి, మర్యాద పాటించాలని ఆయన కోరినట్లు తెలిపారు. ఈసీ సోషల్ మీడియా వేదికలో స్పందిస్తూ, టీఎంసీ ప్రతినిధి బృందానికి ‘స్ట్రెయిట్ టాక్’ ఇచ్చామని పేర్కొంది. ఈసారి బెంగాల్ ఎన్నికలు భయరహితంగా, హింసలేని వాతావరణంలో జరుగుతాయని స్పష్టం చేసింది. ‘చప్పా’, బూత్ జ్యామింగ్, సోర్స్ జ్యామింగ్ వంటి ఎన్నికల అక్రమాలకు అవకాశం ఉండదని తెలిపింది.

సీఈసీ మమ్మల్ని రెండు ప్రశ్నలే అడిగింది

అయితే ఈసీ వ్యాఖ్యలను టీఎంసీ నేతలు తిరస్కరించారు. సాగరికా ఘోష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. సీఈసీ తమను అడిగిన రెండు ప్రశ్నలు మాత్రమే ఉన్నాయని, చివరగా ‘గెట్ లాస్ట్’అని అరిచారని ఆరోపించారు. సాకేత్ గోఖలే కూడా ఎన్నికల సంఘం ఒకే రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. ఎన్నికల సంఘం తటస్థంగా వ్యవహరించాలంటూ టీఎంసీ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ–టీఎంసీ మధ్య వివాదం మరింత రాజకీయ చర్చకు దారి తీసింది. బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్‌ 23న మొదటి దశ, ఏప్రిల్‌ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.