
ఈసీఐ వాట్సాప్ కమిషన్ లా మారింది: సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ‘వాట్సాప్‌పై నడుస్తోంది’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం దక్షిణ 24 పరగణాస్ జిల్లా మురిగంగా నదిపై గంగానగర్ సేతు (వంతెన) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గంగాసాగర్‌లో జరిగిన ప్రజాసభలో మమతా బెనర్జీ మాట్లాడారు.
ఎన్నికల కమిషన్ వాట్సాప్ ఆధారంగా పనిచేస్తోంది. ఇది చెప్పాల్సి రావడం నాకు బాధగా ఉంది. ఒక రోజు ఇలాంటి ఎన్నికల కమిషన్ మాయమవుతుందని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మమతా, ఎస్‌ఐఆర్ ప్రక్రియను బెంగాల్ ప్రజలను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ఓటరు జాబితా నుంచి యథేచ్చగా పేర్లు తొలగిస్తున్నారు
అభిషేక్ బెనర్జీ ఇప్పటికే ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమయంలో 45 మంది ప్రజలు మరణించారని, ఆరుగురు ఆసుపత్రిలో చేరారని, 29 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఆత్మహత్యకు యత్నించారని ఆరోపించారు. అలాగే ఈ అంశాలపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని విమర్శించారు. ఈసీఐ విధానాలన్నీ వాట్సాప్ ద్వారానే నిర్ణయించబడుతున్నాయి. ఇది ఒక ‘వాట్సాప్ కమిషన్’ అని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించిన విషయాన్ని మమతా గుర్తు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు యథేచ్ఛగా తొలగిస్తున్నారు. బెంగాల్ ఎప్పుడూ తలవంచలేదు, ఇక ముందు కూడా తలవంచదని స్పష్టం చేశారు. అలాగే 85 ఏళ్లకు పైబడిన వృద్ధులను, కొందరు ఆక్సిజన్ సహాయంతో వచ్చేవారిని కూడా పిలుస్తున్నారు. గర్భిణీ మహిళలను సైతం హాజరు కావాలని ఆదేశిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఈ దేశంలో జీవిస్తున్న వారు ఇంకా తమ పౌరసత్వం, ఓటరు హక్కు నిరూపించుకోవాలా? అని ప్రశ్నించారు.
బెంగాల్ బహుళ సంస్కృతిని గుర్తుచేస్తూ కొంతమంది ఆలయాల్లో, కొంతమంది మసీదుల్లో, మరికొంతమంది గురుద్వారాల్లో ప్రార్థిస్తారు అదే బెంగాల్ అని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు తప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆమె హెచ్చరించారు. ఇదే సందర్భంలో గంగానగర్ సేతు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఈ వంతెన రాబోయే 2–3 సంవత్సరాల్లో పూర్తవుతుందని సుమారు రూ. 1,700 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు తెలిపారు.
