
ఈశాన్య ప్రజలపై దాడులు సహించం: కిరెన్ రిజిజు
ఈశాన్య భారత రాష్ట్రాల ప్రజలపై జరిగే ఏ విధమైన దాడులు, జాత్యహంకార వ్యాఖ్యలను సహించబోమని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ బుధవారం స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయన నగర్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులపై పొరుగువారు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనపై వారు స్పందించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునుంచే తాను, తన కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రిజిజు తెలిపారు. నేను వ్యక్తిగతంగా పోలీసులతో మాట్లాడాను. ఒకరిని అరెస్ట్ చేశారు. బలమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈశాన్య ప్రజలను ఎవరైనా అవమానిస్తే కఠినంగా పాఠం చెబుతామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈశాన్య ప్రజలపై పలు హింసాత్మక ఘటనలు జరిగాయని, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా చోటుచేసుకున్నాయని రిజిజు గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి ఖాండు మాట్లాడుతూ, విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వేగవంతమైన, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మా ముగ్గురు సోదరీమణులతో మేం బలంగా నిలబడతాం. వారి భద్రత, గౌరవం, న్యాయం మా ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ కోర్టు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రూబీ జైన్, హర్ష్ దంపతులను కోర్టు 14 రోజుల రిమాండ్ కు పంపింది. మార్చి 11 వరకు వారిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని మేజిస్ట్రేట్ భాను ప్రతాప్ సింగ్ ఆదేశించారు. ఫిబ్రవరి 20న అద్దె ఇంటి మరమ్మతుల విషయంలో జరిగిన వాగ్వాదంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. అదనంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం బెదిరింపు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వర్గాల మధ్య వైరం రెచ్చగొట్టడం వంటి అభియోగాలు చేర్చారు.
