
ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు:ఆరుగురికి జైలు శిక్ష
ఈశాన్య ఢిల్లీలో 2020లో చెలరేగిన అల్లర్ల కేసులో ఆరుగురికి కర్కర్ దుమా కోర్టు మంగళవారం శిక్షలు విధించింది. దోపిడీ, అగ్నిప్రమాదం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన కేసుల్లో వీరికి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు రూ.61 వేల చొప్పున జరిమానా విధించింది. ఖాజురీ ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదత్‌పూర్ ప్రాంతానికి సంబంధించినది. అల్లర్ల సమయంలో స్థానిక వ్యాపారి వకీల్ అహ్మద్ దుకాణంలోని వస్తువులను అల్లరి మూకలు బయటకు తీసి కాల్చివేశాయి. అదనపు సెషన్స్ న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ కేసులో హరి ఓం గుప్తా, గోరఖ్ నాథ్, భీమ్ సేన్, కపిల్ పాండే, రోహిత్ గౌతమ్, బసంత్ కుమార్ లను దోషులుగా తేల్చారు. వీరిపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.
వీరికి క్రిమినల్ రికార్డులు లేవు
అల్లర్లకు ముందు వీరికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. తర్వాత కూడా నేరాలను కొనసాగించలేదు. వీరు మారిపోయే అవకాశం ఉంది. అయినా ఇలాంటి అల్లర్లకు పాల్పడినవారికి సడలింపు ఇవ్వడం సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చినట్లవుతుంది. కేవలం జరిమానాతో వదిలేయలేం అని తీర్పులో న్యాయమూర్తులు పేర్కోన్నారు. కోర్టు అక్టోబర్ 31న తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 11న వీరిని దోషులుగా తేల్చి తీర్పు వాయిదా వేసింది. విచారణలో హెడ్ కానిస్టేబుల్ సందీప్, సాక్షి సంగీత చూపిన వీడియో ఆధారంగా ఈ ఆరుగురిని దోషులుగా గుర్తించారు.
ఫిర్యాదు దారుడు మొహమ్మద్ వకీల్ తన దుకాణం కాల్చివేయడంతో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపాడు. విచారణ అనంతరం కోర్టు క్రిమినల్ సెక్షన్ కింద శిక్ష విధించింది. అయితే భవనం ధ్వంసం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టినట్టు తగిన ఆధారాలు లేవని కోర్టు తేల్చింది. 2020 ఫిబ్రవరి 25న జరిగిన అల్లర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణ అనంతరం దోషులకు శిక్షలు ఖరారయ్యాయి. అయితే ఈ తీర్పు పై ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది.
