
ఈయూ-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
దాదాపు పదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మంగళవారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించారు. "పదేళ్ల కృషి తర్వాత మేము లక్ష్యాన్ని సాధించాం. ఈ ఒప్పందం రెండు వైపులా అద్భుతమైన విజయం" అని ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
ఈయూ 'వాణిజ్య త్రయం'!
ఈ ఒప్పందంతో ఐరోపా వాణిజ్య భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించింది. గత రెండు నెలల కాలంలోనే లాటిన్ అమెరికా, భారత్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో కుదిరిన ఒప్పందాల ద్వారా దాదాపు 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్లకు ఐరోపా చేరువైందని ఉర్సులా పేర్కొన్నారు. దీనిని ఆమె ఒక 'ట్రేడ్ ట్రిలోజీ' (వాణిజ్య త్రయం)గా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల ఐరోపా వ్యాపారులకు, ఎగుమతిదారులకు, రైతులకు తక్షణ ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా టారిఫ్ రూపంలో చెల్లించే సుమారు 1 బిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.10 వేల కోట్లు) ఆదా కానున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియాకు ఐరోపా వస్తువుల ఎగుమతులు 33 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు రక్షణ.. ఖనిజాలపై కన్ను
ఈ ఒప్పందంలో ఐరోపా రైతులకు మరిన్ని ఎగుమతి అవకాశాలు కల్పించడంతో పాటు, భౌగోళిక సూచికల ద్వారా వారి ఉత్పత్తులకు గట్టి రక్షణ కల్పించారు. దీనివల్ల మార్కెట్‌లో సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉర్సులా వివరించారు. మరోవైపు ఆధునిక సాంకేతికత, హరిత ఇంధనానికి అవసరమైన కీలక ఖనిజాల విషయంలోనూ ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. రేర్ ఎర్త్స్, లిథియం, టంగ్‌స్టన్ వంటి కీలక ముడి పదార్థాల ఉత్పత్తిపై నాలుగు భారీ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే ఈ ఖనిజాల ఉత్పత్తిలో ఆస్ట్రేలియా అగ్రగామిగా ఉండగా, ఐరోపా వీటికి అతిపెద్ద వినియోగదారుగా ఉంది.
పరిశోధన రంగంలోనూ భాగస్వామ్యం
వాణిజ్యంతో పాటు విజ్ఞాన రంగంలోనూ సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. యూరోపియన్ యూనియన్ ప్రతిష్టాత్మక పరిశోధన, ఆవిష్కరణల కార్యక్రమం 'హోరిజోన్ యూరప్'లో ఆస్ట్రేలియా చేరడానికి చర్చలు ప్రారంభించనున్నారు. ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్య ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, రెండు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మే 1 నుంచి 'ఈయూ - మెర్కోసూర్' ఎఫ్‌టీఏ అమల్లోకి..
మరోవైపు యూరోపియన్ యూనియన్, దక్షిణ అమెరికాలోని నాలుగు దేశాల (బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే) మధ్య దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం వల్ల సుమారు 70 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. చైనా, అమెరికా వంటి దేశాలపై ఆధారపడటం తగ్గించి, సొంతంగా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ఐరోపా ఈ అడుగు వేసింది. అయితే తమ దేశ రైతులు, పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలు దీనిని వ్యతిరేకిస్తున్నా, ఐరోపా కమిషన్ మాత్రం ప్రస్తుతానికి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందం వల్ల కొత్త ఉద్యోగాలు రావడమే కాకుండా, వ్యాపారాలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
