
ఈపీఎస్ -95 పెన్షనర్ల ఆవేదన: 47 లక్షల మందికి పైగా నెలకు రూ. 9,000 లోపే పెన్షన్!
దేశంలోని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 (ఈపిఎస్-95) లబ్ధిదారుల దయనీయ స్థితిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో కీలక గణాంకాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 47.04 లక్షల మంది పెన్షనర్లు నెలకు రూ. 9,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈమేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ స్వల్ప మొత్తం జీవనోపాధికి ఏమాత్రం సరిపోవడం లేదని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈపిఎఫ్ఓ గణాంకాలు:
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డాష్‌బోర్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో మొత్తం ఈపీఎస్-95 పెన్షనర్ల సంఖ్య 82,11,182 గా ఉంది. ఇందులో సగానికి పైగా అంటే 47,04,270 మందికి అందుతున్న పెన్షన్ రూ. 9,000 లోపు ఉండటం గమనార్హం. చాలా కాలంగా కనీస పెన్షన్‌ను పెంచాలంటూ కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని, ప్రస్తుతం ఉన్న రూ.1,000 కనీస పెన్షన్ పరిమితిని సవరించాలని వారు కోరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఈపిఎస్-95 పథకం
ఈపిఎస్-95 పథకం అనేది 'నిర్ణీత సహకారం-నిర్ణీత ప్రయోజన౦' ప్రాతిపదికన నడుస్తుంది. దీని కోసం ఉద్యోగి జీతంలో యాజమాన్యం వాటా నుంచి 8.33 శాతం నిధులు పెన్షన్ ఫండ్‌కు వెళ్తాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నెలకు గరిష్టంగా రూ. 15,000 వేతనంపై 1.16 శాతం నిధులను బడ్జెట్ ద్వారా కేటాయిస్తుంది. ఇలా పోగుపడిన నిధుల నుంచే లబ్ధిదారులకు పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం వివరించింది.
కనీస పెన్షన్ పెంపు డిమాండ్‌పై స్పందిస్తూ, పెన్షన్ ఫండ్ యొక్క దీర్ఘకాలిక మనుగడ అత్యంత ముఖ్యమని మంత్రి తెలిపారు. ప్రతి ఏటా ఈ ఫండ్ విలువను లెక్కించి, వచ్చే ఆదాయం, భవిష్యత్తులో చెల్లించాల్సిన బాధ్యతలను అంచనా వేస్తారని చెప్పారు. 2019 నాటి లెక్కల ప్రకారం ఫండ్‌లో లోటు ఉన్నప్పటికీ, ప్రభుత్వం బడ్జెట్ నుంచి అదనపు నిధులు కేటాయించి కనీసం రూ. 1,000 అందేలా చూస్తోందని ఆమె వెల్లడించారు.
భవిష్యత్తు ప్రణాళికలు
పెన్షనర్లకు మరింత మేలు చేసే దిశగా వేతన పరిమితిని రూ. 15,000 నుండి రూ. 25,000 కు పెంచే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది అమలైతే సామాజిక భద్రత పరిధి విస్తరించడమే కాకుండా, పెన్షన్ ఫండ్‌కు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో పెన్షన్ మొత్తాలను పెంచే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
పెన్షన్ల పంపిణీని సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఇటీవల 'సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా పెన్షనర్లు దేశంలో ఎక్కడి నుండైనా తమ పెన్షన్ పొందవచ్చు. పెన్షన్ మొత్తంలో పెంపు కోసం పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రభుత్వం విడుదల చేసిన ఈ గణాంకాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
