Let's talk: editor@tmv.in
ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Gaddamidi Naveen
27 డిసెంబర్, 2025

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఈ నెల డిసెంబర్ 29న ఉదయం 10:30 గంటలకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఈ సమావేశాలకు రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరగనుంది. 2014 నుండి 2024 వరకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు నదీ జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటాను పొందడంలో గత ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నదీ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి రాజీ పడ్డారని, దీనివల్ల సాగునీటి రంగానికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు సిద్ధమయ్యారు అని స‌మాచారం. తాజాగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సర్పంచ్‌ల సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఘాటుగా విమర్శించారు.

మరోవైపు, నదీ జలాల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీఆర్ఎస్ కూడా భారీగా కసరత్తులు చేస్తోంది. ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను సభ ముందు ఉంచాలని కేటీఆర్, హరీశ్ రావు భావిస్తున్నారు. అయితే, ఈ కీలక చర్చలో పాల్గొనడానికి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా? లేక కేటీఆర్, హరీశ్ రావులే ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారా? అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. నదీ జలాల పంపిణీ, నిధుల వినియోగంపై జరగబోయే ఈ చర్చతో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.