
ఈడీ విచారణకు హాజరైన రాబిన్ ఉతప్ప
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు సోమవారం విచారణకు హాజరయ్యారు. వన్ ఎక్స్ బెట్ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఆయనను ప్రశ్నించి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది.
ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లతో పాటు, మాజీ టీఎంసీ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాను ప్రశ్నించింది. ఇదే కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, నటుడు సోనూ సూద్‌లకు కూడా నోటీసులు పంపింది. వీరు మంగ, బుధవారాల్లో విచారణకు హాజరు కానున్నారు.
వన్ ఎక్స్ బెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఒక ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ సంస్థ. ఈ యాప్ ద్వారా క్రీడలపై పందేలు వేయవచ్చు, క్యాసినో ఆటలు ఆడవచ్చు, ఇతర గేమింగ్ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అయితే భారతదేశంలో ఈ యాప్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ కోట్లాది రూపాయల విలువైన పన్నులను ఎగవేసి, అనేక మంది ప్రజలను, పెట్టుబడిదారులను మోసం చేసిందని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే పలువురిని విచారించగా, మరికొంతమంది క్రీడాకారులు, సినీ నటులు, ఆన్‌లైన్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, ప్రముఖులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.
ఒప్పందాలు, పారితోషికంపై ప్రశ్నలు!
విచారణకు హాజరయ్యే ప్రముఖుల వద్ద నుంచి బెట్టింగ్ సంస్థ వారిని ఎలా సంప్రదించింది?, భారతదేశంలో సంప్రదించాల్సిన వ్యక్తి ఎవరు?, డబ్బు చెల్లింపు విధానం (హవాలా లేదా బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా నగదు), చెల్లింపు జరిగిన ప్రదేశం (భారతదేశంలో లేదా విదేశాలలో) వంటి వివరాలను తెలుసుకోవడానికి ఈడీ ప్రయత్నిస్తోంది. అలాగే వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ చట్టవిరుద్ధమని తెలుసా? అని కూడా ప్రశ్నించింది. వారు వన్ ఎక్స్ బెట్ తో చేసుకున్న ఒప్పంద పత్రాలు, సంబంధిత ఇమెయిల్, ఇతర డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా కోరింది.
కేంద్రం ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిషేధానికి ముందు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో సుమారు 22 కోట్ల మంది భారతీయ వినియోగదారులు ఉన్నారని అంచనా. వీరిలో సగం మంది (సుమారు 11 కోట్లు) సాధారణ వినియోగదారులు. భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉందని నిపుణులు అంచనా వేశారు. ఇది 30 శాతం వృద్ధి రేటుతో పెరుగుతోందని కూడా పేర్కొన్నారు. 2022 నుండి జూన్ 2025 వరకు ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నిరోధించడానికి 1,524 ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది.
