
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈద్) దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న ఆయనను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
నిధుల మళ్లింపుపై ఆరా..
2019-24 మధ్య కాలంలో అమలైన వివాదాస్పద లిక్కర్ పాలసీపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల కేటాయింపు, కొత్త బ్రాండ్‌ల ముసుగులో సాగిన దోపిడీ, హవాలా మార్గంలో జరిగిన నిధుల మళ్లింపుపై విజయసాయి రెడ్డి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. రాష్ట్ర సిట్ గతేడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన నివేదిక ఆధారంగా నమోదైన ఈ కేసులో సుమారు రూ. 3,500 కోట్ల అక్రమ సొమ్ము చేతులు మారిందని ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నిధుల మూలాలు ఎక్కడ ఉన్నాయి? రాజకీయ పెద్దలకు అందిన వాటాలెంత? అన్న కోణంలో విచారణ సాగింది.
ఇదిలా ఉండగా విచారణ సందర్భంగా విజయసాయి రెడ్డి, లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో తనకు ప్రత్యక్ష పాత్ర లేదని టెండర్లు, మద్యం బ్రాండ్‌ల ఎంపిక, ధరల నిర్ణయం వంటి అంశాలు ప్రభుత్వ శాఖలు, అధికార యంత్రాంగం, క్యాబినెట్ స్థాయిలోనే జరిగాయని, తాను వాటిలో జోక్యం చేసుకోలేదని తెలిపారు. తన ద్వారా ఎలాంటి అక్రమ నిధులు మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డీకి వెళ్లలేదని మనీ ట్రయిల్, హవాలా లావాదేవీల, షెల్ కంపెనీలతో తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు రాజకీయ ప్రేరణతో సాగుతోందన్న తన వాదనను పునరుద్ఘాటిస్తూ, అవసరమైన పత్రాలు, ఖాతాల వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.
రాజీనామా వెనుక ఈడీ భయమేనా?
విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జనవరి 25న ఆయన అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణ తీవ్రతను ముందే పసిగట్టిన ఆయన, పార్టీ నుంచి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 'రాజకీయ కుట్ర'గా అభివర్ణించారు. తమ పార్టీ నేతలను మానసికంగా దెబ్బతీసేందుకే కేంద్ర సంస్థలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరిన్ని అరెస్టులు తప్పవా?
ఈ కేసులో లభించిన సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. టెండర్లు దక్కించుకున్న మద్యం కంపెనీల ప్రతినిధులు, గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన కీలక ఉన్నతాధికారులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నిధుల ప్రవాహం మాజీ సీఎం కార్యాలయానికి కూడా చేరిందన్న ఆరోపణల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ కేసుకు సంబంధించి నేడు సంబంధించి మిథున్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
