
ఈడీ నోటీసులు హాస్యాస్పదం: సీఎం పినరయ్ విజయన్
కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్బీ) కేసులో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై ఇటీవల ఈడీ జారీ చేసిన షోకాజ్ నోటీసును కేరళ సీఎం పినరయ్ విజయన్ తీవ్రంగా ఖండించారు. దానిని చాలా హాస్యాస్పదం, నవరసాల నాటకం గా అభివర్ణించారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు ఇలాంటి రాజకీయ చర్యలు సాధారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేఐఐఎఫ్బీ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే చేపట్టామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయం రాగానే ఇలా రాజకీయ నాటకాలు మొదలవుతాయి. ఇది కూడా అలాంటిదే. కేఐఐఎఫ్బీ పై నోటీసా? నవ్వు తెప్పిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమని సీఎం ఎద్దేవా చేశారు. కేఐఐఎఫ్బీ అంటే ఏమిటో కేరళలో అందరికీ తెలుసు. మౌలిక సదుపాయాల సౌకర్యాల అభివృద్ధి కోసమే 2016లో దీన్ని ఏర్పాటు చేశాం. ఐదేళ్లలో రూ.50,000 కోట్ల విలువైన మౌలిక సౌకర్యాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుగా దీన్ని చూశాం అని పినరయి విజయన్ అన్నారు.రిజర్వ్ బ్యాంక్ ప్రమాణాలను ప్రతి ప్రాజెక్ట్ కచ్చితంగా పాటించింది. కొద్దిగా కూడా తప్పు జరగలేదని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిన సంస్థ మీద ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థను ఇబ్బందులు పెట్టడం రాజకీయ కక్షసాధన అని మండిపడ్డారు.
బీజేపీ ఆరోపణలు
ఇక బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ మాత్రం కేరళ ప్రభుత్వం మలయాళీల కష్టార్జిత పన్నులను సీపిఎం పార్టీ నిధుల్లా వాడుతోందని ఘాటుగా ఆరోపించారు. ఆయన ఎక్స్ లో సీఎంను విమర్శిస్తూ ఇలా రాశారు. భారత మార్కెట్‌లో తక్కువ వడ్డీకి రుణం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విదేశాల్లో 9.5శాతం వడ్డీకి రూ.2,100 కోట్లు ఎందుకు తీసుకున్నారు? రూ.21 కోట్లు కమిషన్ ఎవరికి అందింది? విదేశీ మధ్యవర్తులు ఎందుకు ? విదేశీ మారక ప్రమాదాన్ని ఎవరు భరిస్తారు? అలాగే ఫెమా అనుమతులు తీసుకున్నారా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు.
ఈడీ అధికారుల ప్రకారం నవంబర్ 12, 2025నే ఈ షో-కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్ (కేఐఐఎఫ్బీ చైర్మన్), మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఐజాక్ (వైస్ ఛైర్మన్), సీఈవో కేఎం అబ్రహాం, కేఐఐఎఫ్బీ సంస్థలకు ఈ నోటీసులు పంపారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కేసు నేపథ్యం: కేఐఐఎఫ్బీ లండన్, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజీల్లో మసాలా బాండ్ల ద్వారా రూ.2,672.80 కోట్లు సేకరించింది. కానీ ఈ మొత్తంలో రూ.466.91 కోట్లు భూమి కొనుగోలుకు వినియోగించినట్టు ఆరోపణ. ఇది రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ డైరెక్షన్, సర్య్కూలర్‌లకు విరుద్ధమని ఈడీ తేల్చింది.
