
ఈడీ దెబ్బ.. రైనా, ధావన్ ఆస్తులు రూ.11.14 కోట్లు జప్తు!
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాం 'వన్‌ఎక్స్ బెట్' ఆపరేటర్లపై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో మాజీ భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు చెందిన రూ.11.14 కోట్ల మేర ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. రైనా పేరిట రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, ధావన్ పేరిట రూ.4.5 కోట్ల ఆస్తిని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద జప్తు చేశారు.
వివిధ రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన బహుళ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ దర్యాప్తు సాగుతోంది. పీఎంఎల్‌ఏ సెర్చ్‌ల సందర్భంగా ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ‘పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన 60కిపైగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశాం. ఇప్పటికే రూ.4 కోట్లు బ్లాక్ చేశాం' అని అధికారులు తెలిపారు.
దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం, 'వన్‌ఎక్స్ బెట్', దాని సరోగేట్ బ్రాండ్లు 'వన్‌ఎక్స్ బాట్', 'వన్‌ఎక్స్ బాట్ స్పోర్టింగ్ లైన్స్' దేశవ్యాప్తంగా అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రైనా, ధావన్ ఈ బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల డబ్బు అక్రమ బెట్టింగ్ నుంచి వచ్చిన నిధులను దాచడానికి విదేశీ మధ్యవర్తుల ద్వారా లేయర్డ్ ట్రాన్సాక్షన్ల రూపంలో రూట్ చేశారు.
'వన్‌ఎక్స్ బెట్' అనుమతి లేకుండా భారత్‌లో ఆపరేట్ అవుతోంది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వీడియోలు, ప్రింట్ ప్రకటనల ద్వారా భారతీయులను టార్గెట్ చేస్తోంది. భారత బెట్టర్ల నుంచి సేకరించిన నిధులు 6,000కిపైగా మ్యూల్ ఖాతాల ద్వారా రూట్ అవుతున్నాయి. సరైన కేవైసీ లేకుండా పేమెంట్ గేట్‌వేల ద్వారా బదిలీ అవుతున్నాయి. ఈ మార్గాల ద్వారా లాండర్ చేసిన మొత్తం రూ.1,000 కోట్లకుపైగా ఉంటుందని ఈడీ అంచనా.
ఈడీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం పాల్గొనడం, ప్రమోట్ చేయడం మానుకోవాలని సూచించింది. తమ బ్యాంకు ఖాతాలు, పేమెంట్ వాలెట్లను ఇలాంటి ట్రాన్సాక్షన్లకు ఉపయోగించడానికి అనుమతించినా పీఎంఎల్‌ఏ కింద ఏడు సంవత్సరాల వరకు జైలు, ఆస్తుల జప్తు జరుగుతుందని హెచ్చరించింది.
అనుమానాస్పద ప్రకటనలు, హై రిటర్న్స్ ఆఫర్ చేసే బెట్టింగ్ లింకులపై క్లిక్ చేయడం, తెలియని మనీ ట్రాన్స్‌ఫర్లకు బ్యాంకు ఖాతాలు, యూపీఐలు ఇవ్వడం, జూదం యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల్లో చేరడం మానుకోవాలని సలహా ఇచ్చింది. అక్రమ బెట్టింగ్ ఆర్థిక నష్టమే కాకుండా మనీలాండరింగ్, ఇతర నేరాలకు దారి తీస్తుందని, అనుమానాస్పద లావాదేవీలను చట్ట అమలు సంస్థలకు నివేదించాలని కోరింది.
