
ఈడీ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంలో ఊరట
భూ సేకరణ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ల్యాండ్ అక్విటేషన్ కేసులో ఈడీ సమన్లకు హాజరు కాలేదని ఆరోపిస్తూ నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్, సోరెన్ వాదనను స్వీకరించి ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈడీ తరఫున నోటీసు స్వీకరించింది. కౌంటర్ అఫిడవిట్ నాలుగు వారాల్లో దాఖలు చేయాలి. అవసరమైతే, రీజోయిండర్ రెండు వారాల్లో దాఖలు చేయవచ్చు అని కోర్టు పేర్కొంది.
ఈడీ సమన్లకు అవిధేయత చూపిన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలన్న సోరెన్ విజ్ఞప్తిని జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు ఉపశమనం కల్పిస్తూ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు స్టే ఇచ్చింది. జనవరి 2024లో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. భారీ స్థాయిలో భూముల కొనుగోలు, అమ్మకాలలో బినామీ విక్రేతలు, కొనుగోలుదారులను ఉపయోగించి కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, అధికారిక రికార్డుల్లో వక్రీకరణలు జరిగాయని ఆరోపించింది. ఈ కేసు మనీ లాండరింగ్‌కు సంబంధించినదిగా ఈడీ పేర్కొంది. తరువాత, మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, సుమారు ఐదు నెలల తర్వాత సోరెన్ జూన్ 28న రాంచీలోని బిర్సా ముండా జైలునుంచి విడుదలయ్యారు. సోరెన్ అరెస్టు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంపాయ్ సోరెన్ ఐదు నెలల తర్వాత పదవికి రాజీనామా చేయడంతో, హేమంత్ సోరెన్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసులో తదుపరి విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
