Let's talk: editor@tmv.in
‘ఈట్ రైట్ – స్టే హెల్తీ’ వాకథాన్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
‘ఈట్ రైట్ – స్టే హెల్తీ’ వాకథాన్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

‘ఈట్ రైట్ – స్టే హెల్తీ’ వాకథాన్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
7 ఏప్రిల్, 2026

తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతపై సమర శంఖం పూరించింది. ప్రజల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని, ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండిఏ గ్రౌండ్స్ వరకు జరిగిన ఈ వాకథాన్‌లో సుమారు 1,000 మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి, పట్టణీకరణ వల్ల ప్రజలు బయటి ఆహారంపై, ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఉప్పు, పప్పులు, చక్కెర, నూనె వంటి నిత్యావసర వస్తువుల్లో జరుగుతున్న కల్తీ వల్ల గ్యాస్ట్రో సమస్యలతో పాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.41 లక్షల ఆహార వ్యాపార సంస్థలు ఉన్నాయని, వాటిలో 80 శాతం పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపారు. నాసిరకం నూనెల వినియోగం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు

ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టిందని ఆయ‌న తెలిపారు. గత రెండేళ్లలో 11,000కుపైగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇకపై కూడా ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. వ్యవస్థను బలోపేతం చేసేందుకు 24 మంది కొత్త ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించగా, ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రవేశపెట్టారు. అదనంగా నిజామాబాద్, హనుమకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో మూడు కొత్త ప్రాంతీయ ప్రయోగశాలలను రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంగా ఆదేశించారని మంత్రి తెలిపారు. డ్రగ్ కంట్రోల్ అమలు కోసం ఉన్న ఈగల్ వ్యవస్థ తరహాలో ఆహార భద్రతకు ప్రత్యేక వ్యవస్థను త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడం అనేది ప్రభుత్వం, ఉత్పత్తిదారులు, వినియోగదారుల ఉమ్మడి బాధ్యత అని మంత్రి ఉద్ఘాటించారు. “ఈట్ రైట్ – స్టే హెల్తీ” (సరైన ఆహారం తీసుకోండి - ఆరోగ్యంగా ఉండండి) అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.