
ఈజిప్ట్ వంటకం 'కొషరీ'కి యునెస్కో గుర్తింపు
ఈజిప్ట్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకం 'కొషరీ'కి ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ (యునెస్కో) నుండి సాంస్కృతిక సంపదగా గుర్తింపు లభించింది. పప్పుధాన్యాలు, బియ్యం, పాస్తాతో తయారుచేసే ఈ ప్రసిద్ధ ఆహారం, ఈజిప్టులోని లెక్కలేనన్ని ఫుడ్ స్టాళ్లలో లభిస్తుంది. తమ సాంస్కృతిక, చారిత్రక గుర్తింపును ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈజిప్టు ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ గుర్తింపు లభించింది.
ఈజిప్ట్ దేశం ఇటీవల తమ చరిత్ర, సంస్కృతి గురించి ప్రపంచానికి తెలిసేలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా 'కొషరీ' వంటకానికి యునెస్కో గుర్తింపు వచ్చే కొద్ది నెలల ముందు, ఈజిప్ట్ ఒక కొత్త పురావస్తు ప్రదర్శనశాలను ప్రారంభించింది. ఇలాంటి చర్యల ద్వారా దేశ చరిత్రను హైలైట్ చేసి, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలని అధికారులు ఆశిస్తున్నారు.
కొషరీ చరిత్ర
కొషరీ అనేది కేవలం ఈజిప్టు వంటకం కాదు, దీని చరిత్ర వేల సంవత్సరాల వలసలు, వాణిజ్యం, దండయాత్రలతో ముడిపడి ఉంది. కొషరీ ఉత్తర భారతదేశంలో ఉద్భవించిందని, బ్రిటిష్ ఆక్రమణ సమయంలో సైనికుల ద్వారా ఈజిప్టుకు వచ్చిందని ఒక కథనం బాగా ప్రచారంలో ఉంది.
ఆహార పరిశోధకురాలు హాలా బరాకత్ వివరించిన ప్రకారం, కొషరీ వంటకంలో ఉపయోగించే పదార్థాలు అన్నీ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాయి. ఉదాహరణకు పప్పుధాన్యాలు సుమారు 5,800 సంవత్సరాల క్రితమే మధ్యప్రాచ్యంలోని 'ఫెర్టిల్ క్రెసెంట్' ప్రాంతం నుండి ఈజిప్టుకు చేరుకున్నాయి. బియ్యంను తూర్పు ఆసియా దేశాల నుంచి పరిచయం చేయగా, టమోటాలు, మిరపకాయలు మాత్రం శతాబ్దాల తరువాత అమెరికా ఖండాల (ఉత్తర, దక్షిణ అమెరికా) నుండి తీసుకొచ్చారు. అయితే పాస్తాను మాత్రం ఈ వంటకంలో ఆధునిక కాలంలోనే చేర్చారు.
హాలా బరాకత్ ఇంకా మాట్లాడుతూ, కొషరీలోని ఈ వివిధ రకాల పదార్థాలు వేల సంవత్సరాలుగా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి, ఒకచోట కలిశాయని వివరించారు. ఈ వంటకం పేరు భారతీయమై ఉండవచ్చు, కానీ దీనిని తయారుచేసే విధానం మరియు రూపం పూర్తిగా ఈజిప్టుకు ప్రత్యేకమైనవి. అంతేకాక, ఈజిప్టులోని వివిధ ప్రాంతాలలో ఉదాహరణకు అలెగ్జాండ్రియా నుండి అస్వాన్ వరకు దీని తయారీ పద్ధతి మారుతూ ఉంటుంది. మొత్తానికి, కొషరీని ఈజిప్టు ప్రజలు తమ సొంత వంటకంగా మార్చుకున్నారు అని ఆమె స్పష్టం చేశారు.
కొషరీ తయారీలో వైవిధ్యం
యునెస్కో నామినేషన్ పత్రంలో కూడా కొషరీ వంటకంలో ఉండే ఈ వైవిధ్యతను ప్రత్యేకంగా గుర్తించారు. ఈజిప్టులో ప్రాంతాలను బట్టి దీని తయారీ మారుతుంది. ఉదాహరణకు సముద్ర తీర ప్రాంతాలలో పసుపు పప్పులను ఉపయోగిస్తే, కైరో, ఎగువ ఈజిప్టు ప్రాంతాలలో నల్ల పప్పులను వాడతారు. అలాగే కొన్ని ఇళ్లలో దీనికి అదనంగా ఉడికించిన గుడ్లను కూడా కలుపుతారు. సైనాయ్ ప్రాంతంలో దీనికి పోలి ఉండే 'మాదౌస్' అనే వంటకం ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రకాలన్నింటినీ ఏకం చేసే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాటికి ఇష్టాన్ని బట్టి జోడించే వెనిగర్, వెల్లుల్లి ఘాటైన సాస్ (హాట్ సాస్) అందించే ప్రత్యేక రుచి. ఈ మసాలాలే కొషరీకి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి.
యునెస్కో వారసత్వ జాబితాలో చేరడం అనేది ఎక్కువగా గౌరవ, ప్రతిష్టలకు సంబంధించినదే తప్ప, దీని ద్వారా ఎలాంటి ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం ఉండదు. ఈ జాబితాలో మాగ్రెబ్ ప్రాంతంలో సాధారణమైన కౌస్‌కౌస్, దక్షిణ అమెరికన్ వంటకం సెవిచే వంటి ఇతర వంటకాలు కూడా ఉన్నాయి. ఇటాలియన్ వంటకాలు కూడా ఈ సంవత్సరం జాబితాలో చేరాయి.
20వ శతాబ్దంలో కొషరీ వంటకం బాగా ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా ఇందులో జంతువుల ఉత్పత్తులు లేకపోవడం వల్ల ఉపవాసం పాటించే కాప్టిక్ క్రైస్తవులలో, శాఖాహార యువతలో ఇది ప్రధాన ఆహారంగా మారింది. ప్రస్తుతం కొషరీ ఈజిప్టులో అత్యంత గుర్తింపు పొందిన వంటకాల్లోఒకటి. కైరోలో 1963 నుండి ఉన్న ప్రసిద్ధ 'అబౌ టారెక్ కొషరీ' రెస్టారెంట్ ప్రతినిధి అహ్మద్ షేకర్ మాట్లాడుతూ, "ఈజిప్టుకు వచ్చే ఏ విదేశీయుడైనా పిరమిడ్లు, మ్యూజియం సందర్శించి, కొషరీ తినడానికి అబౌ టారెక్ వద్దకు వస్తారు" అని తెలిపారు. కొషరీతో పాటు కర్రలను ఉపయోగించే పురాతన యుద్ధ కళ అయిన తహతీబ్, ఇతిహాస పద్యం సిరాత్ బనీ హిలాల్ వంటి మరో 10 అంశాలు ఈజిప్టు నుంచి ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందాయి.
