Let's talk: editor@tmv.in
‘ఈగల్’ సత్ఫలితాలను ఇస్తోంది:వంగలపూడి అనిత

‘ఈగల్’ సత్ఫలితాలను ఇస్తోంది:వంగలపూడి అనిత

Panthagani Anusha
15 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని కూకటివేళ్లతో సహా నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన యుద్ధం సత్ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. యువతను డ్రగ్స్ రక్కసి నుండి రక్షించి వారి భవిష్యత్తును దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు. గత 19 నెలలుగా గంజాయి ఇతర మత్తు పదార్థాల నిరోధానికి పోలీసులు, ‘ఈగల్’ విభాగం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి ‘ఈగల్’ వార్షిక నివేదిక

గత ఏడాది కాలంలో ‘ఈగల్’ విభాగం సాధించిన విజయాలు అమలు చేసిన ప్రత్యేక కార్యక్రమాలపై రూపొందించిన వార్షిక నివేదికను ఆ విభాగం ఐజీ రవికృష్ణ శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగం సాధించిన ఫలితాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి అనిత పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో క్షేత్రస్థాయిలో అధికారులు గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారని తెలిపారు.

శాటిలైట్, డ్రోన్లతో గంజాయి సాగుపై వేట

రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టేందుకు “ఆపరేషన్ చైతన్యం” పేరుతో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు మంత్రి వివరించారు. శాటిలైట్ ఇమేజరీ, డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగును గుర్తించి వేల ఎకరాల్లో పంటను ధ్వంసం చేశామని వెల్లడించారు. కేవలం అణచివేత చర్యలకే పరిమితం కాకుండా గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను చూపిస్తూ వారిలో సానుకూల మార్పు తీసుకువస్తున్నామని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

క్యాంపస్‌లే లక్ష్యంగా ‘ఆపరేషన్ సేఫ్ జోన్’

విద్యాసంస్థల దరిదాపుల్లోకి డ్రగ్స్ చేరకుండా “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” ద్వారా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 47 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులను చైతన్యపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా ‘ఈగల్ క్లబ్‌లను’ ఏర్పాటు చేశామని, 35 వేలకు పైగా అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. వ్యసనాలకు లోనైన వారి కోసం డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు.

అదేవిదంగా రాబోయే రోజుల్లో ‘డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’ సాధనే తమ అంతిమ లక్ష్యమని మంత్రి అనిత ప్రకటించారు. ఈ దిశగా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని యువత భవిష్యత్తు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.