Let's talk: editor@tmv.in
ఈగల్ ఛాలెంజ్: గంజాయి పట్టిస్తే రూ.5,000.. తాగేవారిని పట్టిస్తే రూ.1,500

ఈగల్ ఛాలెంజ్: గంజాయి పట్టిస్తే రూ.5,000.. తాగేవారిని పట్టిస్తే రూ.1,500

Gaddamidi Naveen
25 ఆగస్టు, 2026

విజయవాడ నగరంలో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో గంజాయిని పూర్తిగా అణచివేసేందుకు విజయవాడ నగర పోలీసులు ‘ఈగల్ ఛాలెంజ్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గంజాయి రవాణా చేసేవారు లేదా విక్రయించే వారిని గుర్తించి సమాచారం అందించిన వారికి రూ. 5,000 నగదు బహుమతి, అలాగే గంజాయి సేవించే వారిని పట్టిస్తే రూ. 1,500 బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

ఆదివారం విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఈ 'ఈగల్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అధికారికంగా ప్రారంభించి, గంజాయి కట్టడికి చేపడుతున్న చర్యలను వివరించారు. విజయవాడ నగరంలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మంది మోస్ట్ వాంటెడ్ వ్యక్తులపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు.

ఇటీవల ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కేసులతో సంబంధం ఉన్న 1,287 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అజిత్‌సింగ్‌నగర్‌లో పరీక్షలు నిర్వహించిన 469 మందిలో 128 మందికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 వేల విద్యాసంస్థల్లో ఈగల్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. అలాగే 849 గంజాయి హాట్‌స్పాట్లపై నిఘా పెంచి, రవాణా, విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం కోసం 112 / 1972కు లేదా 7328909090 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.